
గోదాం వినియోగంలోకి తెస్తాం..
మండల కేంద్రంలో 1.20 లక్షల సంచుల సామర్థ్యంతో నిర్మించిన గోదాంను వినియోగంలోకి తెచ్చి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని వెంటనే తరలిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని గోదాంను ఆయన పరిశీలించి రహదారికి స్థలం ఇచ్చిన ఇరువురు రైతులకు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రహదారి సమస్యతో ఇంతకాలం గోదాంను వినియోగించుకోలేకపోయామని.. యుద్ధప్రాతిపదికన మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లోని రైతుల ధాన్యాన్ని గోదాంకు చేరవేస్తామని చెప్పారు. హమాలీల సంఖ్య తక్కువగా ఉండటంతో ధాన్యాన్ని సకాలంలో తూకం చేయడం లేదని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకురాగా.. పక్క గ్రామాల్లోని హమాలీలను వినియోగించుకోవాలని తహసీల్దార్ వరలక్ష్మిని ఆదేశించారు. గ్రామంలోని హమాలీలు అడ్డుకుంటే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు బీరయ్యయాదవ్, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య, నాయకులు రవీందర్‌రెడ్డి, బస్వరాజుగౌడ్, ఏపీఎం బిచ్చన్న ఉన్నారు.