
ప్రథమ చికిత్స.. ప్రశ్నార్థకం?
వనపర్తిటౌన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో బస్సుల్లో కనీసం ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. బస్సుల్లో గాయపడిన, వేసవి తాపానికి తట్టుకోలేక అస్వస్థతకు గురైన వారికి కనీస చికిత్స అందించేందుకు కూడా సౌకర్యాలు లేదు. చిన్నపాటి గాయమైన ప్రయాణికులు ఆస్పత్రులు, మందుల దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. అత్యవసర సమయంలో అవసరమయ్యే మందులు, వేసవిలో కనీసం ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం లేదు. వనపర్తి డిపో పరిధిలోని 108 బస్సులు రోజు వివిధ ప్రాంతాలకు 60 వేల మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తాయి. దీంతో ఆర్టీసీకి రోజుకు రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా.. ప్రయాణికుల అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ప్రథమ చికిత్స కిట్లను కూడా అధికారులు సమకూర్చలేకపోతున్నారు. కొన్ని బస్సుల్లో పెట్టెలు కనిపిస్తున్నా వాటిలో మందులు లేవు. సూపర్‌లగ్జరీ బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెల స్థానంలో టీవీలు, టేప్‌రికార్డులు బిగించగా.. మరికొన్నింటిలో ఖాళీగా ఉంచారు. కొంతకాలం కింద జిల్లాకేంద్రంలోని బస్టాండ్‌లో బస్సు చెట్టును ఢీకొట్టగా డ్రైవర్, ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
పెట్టెలో ఉండాల్సినవి..
దూది, బ్యాండేజ్ క్లాథ్, అయింట్‌మెంట్, గాయం శుభ్రం చేసేందుకు హైడ్రోజన్ పెరాకై ్సడ్, నార్మల్ సైలెన్ తప్పనిసరిగా ఉండాలి. వీటికి అదనంగా పారాసిటమాల్ మాత్రలు, వేసవిలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉంచాల్సి ఉంటుంది. డిపోలో ఉన్న బస్సులో చాలా వరకు ప్రథమ చికిత్స పెట్టెలు లేవు. మరికొన్నింట్లో అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. కొత్తగా బస్సులు వచ్చినప్పుడే ప్రథమ చికిత్స పెట్టెలో మందులు ఉంటాయని సిబ్బంది పేర్కొంటున్నారు. అద్దె బస్సుల్లో సైతం ఈ పెట్టెలు ఉండటం లేదు.
శిక్షణ కరువు..
బస్‌డ్రైవర్లు, కండక్టర్లకు ప్రథమ చికిత్సపై కనీస అవగాహన కల్పిస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. ప్రథమ చికిత్స పెట్టెలో మందులు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తేగాని సమకూర్చరని సిబ్బంది చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక నిధుల కేటాయింపు కూడా అవసరం.
ఆర్టీసీ బస్సుల్లో కానరాని కిట్లు
కనీస మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లుఅందుబాటులోని లేని వైనం
పట్టించుకోని యంత్రాంగం

ప్రథమ చికిత్స.. ప్రశ్నార్థకం?

ప్రథమ చికిత్స.. ప్రశ్నార్థకం?