
వేగంగా సంక్షేమ పథకాల అమలు
వనపర్తి: మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పుర కమిషనర్లతో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, ఉపాధిహామీ పథకం, వర్షాకాలంలో అంటురోగాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. జనవరి 26న ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని 1,300 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అందులో ఇప్పటి వరకు గ్రౌండింగ్ పూర్తయినవి.. మిగిలినవి పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలు మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదో వారితో ఇష్టం లేదని రాతపూర్వకంగా లేఖలు తీసుకోవాలని.. వారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. రెండోవిడతలో భాగంగా ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా లక్ష్యం మేరకు ప్రత్యేక అధికారులు స్క్రూటినీ చేసిన జాబితాను తన లాగిన్‌కు త్వరగా పంపించాలన్నారు. వివిధ సంక్షేమ శాఖలకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి జాబితాను బ్యాంకులకు అందజేయాలని, ఈ ప్రక్రియ 15వ తేదీగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కూలీలకు 15 లక్షల పనిదినాలు కల్పించేందుకు లక్ష్యంగా నిర్ధేశించామని.. ఇప్పటి వరకు కేవలం 2.60 లక్షల పని దినాలు మాత్రమే కల్పించామని, ఇప్పుడు రోజుకు 40 వేల పని దినాలు కల్పిస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోలేమని చెప్పారు. గ్రామాల్లో ఉపాధి పనులు గుర్తించి అత్యధికంగా కార్మికుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈసారి గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు అవకాశం ఉంటుందని, వచ్చే వన మహోత్సవంలో ప్రతి గ్రామ రహదారికి ఇరువైపులా 6 అడుగుల ఎత్తుగల మొక్కలు నాటాలని సూచించారు. రానున్న వర్షాకాలంలో దోమలతో డెంగీ, మలేరియా, డయేరియా తదితర సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులను ప్రతి నెల 1, 11, 21 తేదీల్లో శుభ్రం చేసేలా చూడాలని, బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం..
లైెసన్స్ సర్వేయర్ల శిక్షణకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ (గణిత శాస్త్రం) అంశంగా కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు, ఐటీఐలో డ్రాఫ్ట్ మెన్ సివిల్, డిప్లొమా ఇన్ సివిల్, బీటెక్ సివిల్, ఇతర సమానమైన విద్యార్హత కలిగి వారు అర్హులని.. మీ–సేవ కేంద్రాల్లో ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. శిక్షణ ఫీజు ఓసీలు రూ. వేలు, బీసీలు రూ.ఐదు వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.2,500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని.. ఎంపికై న వారికి జిల్లాకేంద్రంలో 50 పనిదినాల్లో తెలంగాణ అకాడమీ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 98490 81489, 94419 47339 సంప్రదించాలని సూచించారు.