
నంబర్ ప్లేట్ మార్చాల్సిందే..
అచ్చంపేట: నకిలీ నంబర్ ప్లేట్లను అరికట్టడం, రహదారి భద్రతలపై సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అన్ని రకాల వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు(హెచ్‌ఎస్‌ఆర్‌పీ) తప్పనిసరి చేస్తూ.. రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు కొనుగోలు చేసిన వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుంటే ఇకపై రోడ్డుపై నడిపేందుకు అవకాశం లేదు. కాలపరిమితి ముగిసిన వాహహనాల నంబర్ ప్లేట్ల పైనా నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు జిల్లా రవాణాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని రకాల పాత వాహనాలకు ఇప్పుడున్నవి కాకుండా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి తుది గడువు సెప్టెంబర్ 30గా ప్రకటించింది. లేని పక్షంలో భారీ జరిమానాలు, శిక్షలు వేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వీటిని అమర్చుకునేందుకు ప్రత్యేక రుసుములు ప్రకటించారు. వాహనాల తీరు ఆధారంగా ధరలు నిర్ణయించింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది.
పటిష్ట చర్యలు
నిర్దేశిత గడువు నిండిన వాహనాలు రోడ్డుపై నడపకుండా ఉండేందుకు రవాణాశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. 15 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన వాహనాలను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. నిర్ణీత కాల పరిమితి ముగిసిన వాహనాలు వేర్వేరు నంబర్ ప్లేట్లపై రోడ్డుపై తిరుగుతూ ప్రమాదాల కారణం అవుతున్నాయి. అనేక వాహనాలకు సకాలంలో సామర్థ్యం పరీక్షలు చేయడం లేదు. ఇలాంటి వాటికి ఆడ్డుకట్టు పడనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2018 డిసెంబర్ 31 నాటికి 6,01,677 వాహనాలు ఉండగా 2019 జనవరి 1 నుంచి 2025 ఏప్రిల్ 30 వరకు 3,68,574 వాహనాలతో మొత్తం 9,65,761 వాహనాలు ఉన్నాయి. ఐదు జిల్లాల రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో నిత్యం పదుల సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్లు జరగుతున్నాయి. సాధారణ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు 4 లక్షలకు పైగానే ఉంటాయని సమాచారం. ఈ వాహనదారులంతా తప్పనిసరిగా హెచ్‌ఎస్‌ఆర్ ప్లేట్లు బిగించుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాహనాలకు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, కాలుష్య నిరాధరణ పత్రాల వంటి తదితర సేవలను నిలిపివేస్తారు. వాటిని అమ్మాలన్నా.. కొనాలన్నా ఇబ్బందులు తప్పవు. ఆర్‌టీఏ అధికారుల తనిఖీల్లో పట్టబడితే కేసులు నమోదు చేసి జరిమానా వేయడం లేదా వాహనాలు సీజ్ చేయడం చేస్తారు.
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌కు
చెల్లించే రుసుము ఇలా..
ద్విచక్రవాహనం 320-360
కార్లు 590-700
కమర్షియల్ వాహనాలు 600-800
త్రిచక్రవాహనాలు 350-450
2018 డిసెంబర్ 31వ తేదీకి ముందు వాహనాల వివరాలిలా..
జిల్లా బైక్‌లు కార్లు ఆటోలు గూడ్స్ ట్రాక్టర్లు/ట్రైలర్లు ఇతర
వాహనాలు
మహబూబ్‌నగర్ 2,70,491 26,069 14,585 9,872 19,493 433
వనపర్తి 37,407 6093 2,415 3,845 6,678 2,424
నాగర్‌కర్నూల్ 41,291 6,893 3,610 4,391 9,770 342
గద్వాల 58,956 4,856 1,648 3,267 6,811 218
నారాయణపేట 40,059 4,953 3,135 2,700 8,823 149
2019 జనవరి నుంచి 2025 ఏప్రిల్ వరకు కొనుగోలు చేసిన వాహనాలు
జిల్లా బైక్‌లు కార్లు ఆటోలు గూడ్స్ ట్రాక్టర్లు/ట్రైలర్లు ఇతర
వాహనాలు
మహబ్‌బ్‌నగర్ 84,061 13,548 5,873 4,310 7,917 163
వనపర్తి 36,767 4,376 1,968 2,114 7,373 01
నాగర్‌కర్నూల్ 47,797 6,225 1,947 3,416 15,093 78
గద్వాల 56,329 4,199 697 2,101 6,803 44
నారాయణపేట 42,405 3,719 2,409 1,423 5,404 44
పాత వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్
పాత వాహనాలకు అమర్చుకోవాలి
పాత వాహనాలకు కొత్తగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేటు అమర్చుకోవాలి. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం వాహనాలకు ఫీజును నిర్ధారించారు. 15 ఏళ్లు దాటిన వాహనాలకు మరో 5 ఏళ్లు గడువు పొడిగించాలంటే వాహనదారుడు నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే దానికి బార్‌కోడ్ వస్తోంది. అప్పడు వాటికి హైసెక్యూరిటీ నంబర్ల ప్లేటు అమర్చుకోవాల్సి ఉంటుంది. తనిఖీలో పట్టుబడితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తాం. వాహనాలకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేస్తాం.
– చిన్నబాలు, రీజినల్ ట్రాన్స్‌పోర్టు అధికారి, నాగర్‌కర్నూల్
మార్పు ఇలా..
పాత వాహనానికి కొత్తగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు పొందాలంటే వాహనదారుడే నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ఎస్‌ఐఏఎం.ఇన్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాహనం నంబర్, ఫోన్‌నంబర్, వాహన రకం, కంపెనీ, జిల్లా తదితర వివరాలు నమోదు చేయాలి. నంబర్ ప్లేట్ షోరూం వివరాలు వస్తాయి. వెంటనే ఆ షోరూంకు వెళ్లి వాహనానికి అమర్చుకొని ఫొటోను తీసి మరోసారి వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయాల్సిన బాధత వాహనదారుడిపైనే ఉంటుంది. ఇదిలాఉండగా, నిరక్షరాస్యులు, స్మార్ట్‌ఫోన్‌లు లేని వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఉత్తర్వులు జారీ చేసిన రవాణాశాఖ
2019 కంటే ముందు కొనుగోలు చేసిన వాటికి తప్పనిసరి
సెప్టెంబర్ 30 వరకు తుది గడువు
నకిలీ నంబర్
ప్లేట్ల కట్టడి..
రహదారి భద్రతే లక్ష్యం