
నైపుణ్యాభివృద్ధి దిశగా..
అమరచింత: యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఒక్కొక్క క్యాంపులో 100 మంది విద్యార్థులు ఉండేలా ప్రణాళిక రూపొందించింది. నిబంధనలతో వీరికి ఆటపాటలతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నేర్పించాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఒక్కొక్క పాఠశాలకు నలుగురి చొప్పున వలంటీర్లను నియమించింది. వీరికి రూ. 3వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. జిల్లాలో 50 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఎంపిక కాగా.. ఇప్పటి వరకు 35 పాఠశాలల్లో శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో శిక్షణ శిబిరాలు కొనసాగేలా సంబంధిత అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. పాఠశాలల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని హెచ్‌ఎంలకు ఉన్నతాధికారులు ఆదేశించడంతో.. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
సర్కార్ బడుల్లో వేసవి శిబిరాలు
● జిల్లాలో 50 ఉన్నత పాఠశాలల ఎంపిక
● ఒక్కో క్యాంపులో 100 మంది విద్యార్థులు
● అల్పాహారం కోసం రూ.15 చొప్పున చెల్లింపు
● శిక్షణకు నలుగురి చొప్పున వలంటీర్ల నియామకం
సెలవులతో ఇబ్బందులు..
పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో సమ్మర్ క్యాంపుల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారింది. విద్యార్థుల వివరాలతో వారి వారి ఇళ్లకు పాఠశాలకు రావాల్సిందిగా కోరుతున్నారు. అత్యధికంగా విద్యార్థులు సెలవుల్లో తమ బంధువుల ఇళ్లకు వెళ్లడంతో చివరికి క్యాంపు నిర్వహణ కోసం కేజీబీవీ విద్యార్థినులను సైతం చేర్పించుకుంటున్నారు. 6నుంచి 9 తరగతులకు సంబంధించి 25 మంది చొప్పున విద్యార్థులను చేర్పించుకోవాల్సి ఉండగా.. ప్రస్తుతానికి ఆయా పాఠశాలల్లోని క్యాంపుల్లో కేవలం 30 నుంచి 50 మందితోనే నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న విద్యార్థులను క్యాంపులకు రప్పించే యత్నం చేస్తున్నారు. మొత్తానికి క్యాంపు నిర్వహణ ప్రారంభం నుంచి 15 రోజులపాటు యథావిధిగా నిర్వహించి ముగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.