
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
గోపాల్‌పేట: భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని.. మండలంలో కొనసాగుతున్న సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం మండలంలోని తాడిపర్తి, మున్ననూరులో జరిగిన భూ భారతి రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. అధికారులు అందుబాటులో ఉండి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. సాధ్యమైనంత వరకు సదస్సుల్లోనే సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని, సక్సేషన్ దరఖాస్తులు వస్తే వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించారు. తాడిపర్తిలో 36, మున్ననూరులో 35.. మొత్తం 71 దరఖాస్తులు వచ్చాయని, వెంటనే పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. రెవెన్యూ సదస్సులు జరిగే గ్రామాల్లో ఒకరోజు ముందుగానే చాటింపు వేయించాలన్నారు.
కేంద్రాల నుంచి వెనువెంటనే ధాన్యం తరలింపు
వరి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చిన వెంటనే తేమశాతం పరిశీలించి కొనుగోలు చేసి గోదాములు, మిల్లులకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం మండలంలోని తాడిపర్తిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యంలో తాలు, గడ్డి లేకుండా శుభ్రంగా ఉంటే మిల్లుల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం గ్రామంలోని ఒకటో నంబర్ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి వచ్చిన బియ్యం, ఇప్పటి వరకు పంపిణీ చేసిన బియ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్ నివేదికను పరిశీలించి ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో బియ్యం పంపిణీ వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి విశ్వనాథ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ పాండు తదితరులు ఉన్నారు.