
‘భూ భారతి’తో రైతులకు మేలు
గోపాల్‌పేట: భూ భారతి చట్టం అమలుతో రైతుల భూ సమస్యలు తొలగిపోతాయని.. ప్రశాంతంగా పరిష్కరించుకోవచ్చని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని పైలట్ మండలం గోపాల్‌పేటలో ఉన్న చెన్నూరు, జయన్న తిర్మలాపూర్‌లో రెవెన్యూ సదస్సులు జరగగా.. జయన్న తిర్మలాపూర్‌లో జరిగిన సదస్సులో ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ హయాంలో పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ చేస్తే పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి భూములు లాక్కుందని ఆరోపించారు. పట్టాదారు పాసు పుస్తకంలో తప్పులుంటే సరి చేసుకునేందుకు అవకాశం ఉండేదని.. అధికారులు ఇష్టానుసారంగా పోర్టల్‌ను వినియోగించే వారన్నారు. ధరణితో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. భూ భారతిలో అధికారులు ఎటువంటి తప్పులు చేయకుండా, ఒకవేళ తప్పులు దొర్లినా సరి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, రైతులు ఫిర్యాదు చేసేందుకు రెండంచెల వ్యవస్థ ఉందని గుర్తు చేశారు. ఈ చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. స్వీకరించిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చెన్నూరులో 36, జయన్న తిర్మలాపూర్‌లో 25 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సెక్సేషన్–18, మిస్సింగ్ సర్వేనంబర్–2, పెండింగ్ మ్యూటేషన్–1, డిజిటల్ సైన్–1, భూ విస్తీర్ణంలో సవరణలు 2, పేర్ల సవరణ–5, పార్ట్–బి–1, అసైన్డ్ పట్టా–3, తదితరాలు 28 దరఖాస్తులు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయాలని, సక్సేషన్‌కు సంబంధించి వెంటనే నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కుటుంబసభ్యుల ధ్రువపత్రాలకు సంబంధించి మీసేవ సిబ్బందిని వెంట ఉంచుకొని త్వరగా అయ్యేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ప్రత్యేక అధికారి రాజు, మండల రెవెన్యూ అధికారి పాండు తదితరులు పాల్గొన్నారు.
గోపాల్‌పేట మండలంలో
ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు
మొదటిరోజు 61 దరఖాస్తులు..
స్వీకరించిన రాష్ట్ర ప్రణాళికా
సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి,
కలెక్టర్ ఆదర్శ్ సురభి