
పెరిగిన ఆరుతడి సాగు
● జిల్లాలో అత్యధికంగా ఖిల్లాఘనపురం, చిన్నంబావి మండలాల్లోనే..
● మొక్కజొన్న, మినుము, పప్పుశనగ,
కీర, కర్బూజ సాగుకు ఆసక్తి
● తక్కువ నీటి వినియోగం..
అధిక దిగుబడులు
ఖిల్లాఘనపురం/చిన్నంబావి: ఒకప్పుడు వరి మాత్రమే సాగు చేసే రైతులు ఈ ఏడాది యాసంగిలో వరితో పాటు ఆరుతడి పంటల సాగుకు ఆసక్తి చూపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖిల్లాఘనపురం మండలంలో కేఎల్‌ఐ సాగునీరు అందుతుండటంతో వర్షాకాలం సాగు పూర్తికాగానే రెండోపంటగా ఆరుతడి పంటలు సాగు చేసున్నారు. మండలంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది యాసంగిలో 510 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ ఏడాది వర్షాకాలం పంటలు పూర్తికాగానే రెండో పంటగా మొక్కజొన్న 400 ఎకరాలు, మినుము 70, కీర దోస 15, రాగులు–10, ఉల్లి–15 మొత్తం 510 ఎకరాలు సాగయ్యాయని చెబుతున్నారు. కీరదోస, మినుము పంట కేవలం 70 రోజుల్లో పూర్తి కావడంతో పాటు లాభాలు వస్తున్నట్లు రైతులు వివరించారు. మొక్కజొన్న 110 రోజుల్లో కోతకు వస్తుంది. ఆయా పంటలకు వారంలో ఒకతడి నీరందిస్తే సరిపోతుంది. నీటి ఆదాతో పాటు అధిక దిగుబడి వస్తుండటంతో మంచి లాభాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.
4 ఎకరాల్లో మినుము
సాగు చేశా..
యాసంగి పంటగా 4 ఎకరాల్లో మినుము సాగు చేశా. ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటా రూ.9 వేల నుంచి రూ.10 వేల ధర పలుకుతుంది. 70 రోజుల్లో పంట చేతికందుతుంది. తక్కువ నీటి వినియోగం, అధిక దిగుబడి వస్తుండటంతో లాభదాయకంగా ఉంటుంది.
– బాలయ్య, సల్కెలాపురం (ఖిల్లాఘనపురం)
ఆరుతడి సాగు శుభపరిణామం..
రైతులు ఆరుతడి పంటల సాగుకు ముందుకు రావడం శుభపరిణామం. ఒకప్పుడు పంటమార్పిడి చేయాలని పెద్దఎత్తున ప్రచారం చేసినా రైతులు పట్టించుకోలేదు. ఈ ఏడాది మండలంలో చాలామంది ఆరుతడి పంటలు సాగుచేశారు. ఆరుతడి పంటలకు తక్కువ నీరు వినియోగం అవడంతో పాటు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
– మల్లయ్య, మండల వ్యవసాయ అధికారి, ఖిల్లాఘనపురం
చిన్నంబావి మండలంలో..
మండలంలోని పెద్దదగడ, లక్ష్మీపల్లి, పెద్దమారూర్, చిన్నమారూర్, కొప్పునూరు, వెల్టూరు, అయ్యవారిపల్లి, బెక్కం తదితర గ్రామాల్లో అధికంగా మినుము సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఈ యాసంగి సీజన్‌లో 12 వేల ఎకరాలు సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. ఎకరాలకు ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. దీనికితోడు నాలుగు వేల ఎకరాల్లో కర్బూజ, కలంగిరి వంటి పండ్ల తోటలు సైతం సాగు చేశారు. అలాగే కృష్ణానది ముంపు ప్రాంతంలో సుమారు 15 వేల ఎకరాల్లో అధికంగా పప్పుశనగ సాగు సాగవుతుంది.

పెరిగిన ఆరుతడి సాగు

పెరిగిన ఆరుతడి సాగు

పెరిగిన ఆరుతడి సాగు