
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం
అమరచింత: ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు కె.సూర్యం ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మార్క్స్ భవనంలో ఉమ్మడి మండలాల మాస్‌లైన్ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక, కర్షక చట్టాలకు వ్యతిరేకంగా నడుచుకుంటుందన్నారు. మోదీ ప్రభుత్వం అదాని, అంబానీలాంటి కార్పొరేట్ యాజమానులకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ వారి వ్యవస్థలు నడుపుకోవడానికి రాయితీలు ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌కు అప్పజెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి మనిషికి పని, పనికి భద్రత, విద్య, ఆరోగ్యం, కూడు, గూడు ప్రధానమైనవి కాగా.. కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని.. ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని నెరవేర్చలేకపోతోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి హన్మంతు, ప్రసాద్, రాజు, రాజన్న, ఆశన్న, సామేలు, ప్రేమరత్నం, మస్లమణి, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.