వనపర్తి: జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి బీరం సుబ్బారెడ్డిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారిక బ్యాంకు ఖాతా నుంచి నిధులు డ్రా చేసిన విషయంపై గత నెల 27న ‘అడ్డగోలు చెల్లింపులు’, ఈ నెల 6న ‘నిధుల గోల్‌మాల్’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు కలెక్టర్ స్పందించారు. సమగ్ర విచారణ జరిపి ముందుగా షోకాజ్ నోటీసు జారీచేసిన అనంతరం శుక్రవారం సస్పెండ్ చేశారు. ఈయన వ్యవహారంపై పీడీఎస్‌యూ, బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు సైతం వేర్వేరుగా రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందజేశారు. ఎట్టకేలకు కలెక్టర్ సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో కలెక్టరేట్లోని వివిధ ప్రభుత్వశాఖల అధికారుల్లో అలజడి మొదలైంది.