ఏమైపోయారో.. | - | Sakshi
Sakshi News home page

ఏమైపోయారో..

Mar 7 2025 12:36 AM | Updated on Mar 7 2025 12:36 AM

ఏమైపో

ఏమైపోయారో..

లాంగిట్యూడ్‌,

లాటిట్యూడ్‌ ఆధారంగా..

భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ ప్రతినిధుల బృందం సొరంగం ప్రాంతానికి చేరుకుంది. వారితో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి.. సర్వే చేసి కచ్చితమైన నివేదిక అందించాలని కోరారు. గురువారం అమ్రాబాద్‌ రేంజ్‌లో లాంగిట్యూడ్‌, లాటిట్యూడ్‌ ఆధారంగా సర్వే చేయనున్నట్లు తెలిసింది. స్థానిక ఫారెస్టు అధికారులు వారికి సహకరిస్తున్నారు.

● సహాయక చర్యలను కేంద్రం నుంచి వచ్చిన మినిస్ట్రీ ఫర్‌ హోం అఫైర్స్‌ నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సెక్రటరీ కల్నల్‌ కీర్తి ప్రతాప్‌ సింగ్‌ పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి అరవింద్‌కుమార్‌ టన్నెల్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. ప్రస్తుతం టీబీఎంను కొద్దికొద్దిగా కట్‌ చేస్తూ కార్మికులను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. కన్వేయర్‌ బెల్ట్‌ మళ్లీ ప్రారంభం కావడంతో మట్టిని బయటికి తరలించే ప్రక్రియ మొదలైతే సహాయక చర్యలు వేగవంతం కానున్నాయని పేర్కొన్నారు.

నేటికీ అంతుచిక్కని

8 మంది కార్మికుల ఆచూకీ

ఎస్‌ఎల్‌బీసీలో కొనసాగుతున్నసహాయక చర్యలు

తాజాగా రంగంలోకి కేరళ క్యాడావర్‌ డాగ్స్‌

ఐఐటీ నిపుణులతో టన్నెల్‌లోకి సింగరేణి, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

అచ్చంపేట రూరల్‌: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 రోజులుగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది. తిండీ తిప్పలు దేవుడెరుగు.. కనీసం గాలి, వెలుతురు కూడా లేకుండా ఊపిరి సలపని చీకటి గుహలో తమ వారు ఎలా ఉన్నారో.. ఏమైపోయారో అంటూ టన్నెల్‌ వెలుపల కార్మికుల కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురుచూస్తూనే ఉన్నాయి. దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం 13 రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. గురువారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ సూచనలు చేశారు. ఈ క్రమంలోనే సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా క్యాడావర్‌ డాగ్స్‌ రప్పించినట్లు అరవింద్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఉదయం షిఫ్టులో సింగరేణి, ఐఐటీ నిపుణులతోపాటు సైనిక అధికారులు సొరంగం లోపలికి వెళ్లారు.

మట్టి తరలింపులో ఇబ్బందులు..

సొరంగంలో పేరుకుపోయిన, మట్టి, రాళ్లు, బురద బయటకు పంపడానికి సింగరేణి కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీపీఆర్‌ మిషన్‌ చూయించిన చోట 6, 7 మీటర్ల లోపల ఉన్న అవశేషాల కోసం ప్రతిరోజు అన్వేషణ కొనసాగుతోంది. జీపీఆర్‌ చూయించిన ప్రదేశంలోనే ఎక్కువ శాతం పనులు కొనసాగిస్తుండటం, చివరికి ఆ ప్రాంతంలో ఎలాంటి అవశేషాలు కనిపించకపోవడంతో శ్రమిస్తున్న సింగరేణి కార్మికులకు నిరాశే మిలుగుతోంది. దీనికి తోడు 7 మీటర్ల లోతులో మట్టిని తవ్వి పక్కనే పడేస్తున్నారు. మట్టిని తవ్వడానికి కార్మికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కన్వేయర్‌ బెల్ట్‌ పనులు కొనసాగితే ఆ మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను బయటకు పంపిస్తే పని సులువవుతుందని కార్మికులు అంటున్నారు. గోతులు తవ్వితే అధికంగా నీరు, బురద వస్తుంది. దీంతో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

అందుబాటులో ఉండాలి..

సొరంగం వద్ద సహాయక చర్యల్లో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి సహకరించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆదేశించారు. అందరూ సమన్వయంతో, సహకారం అందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వివిధ విపత్తుల ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది సొరంగ ప్రాంతానికి వస్తున్నారని, వారికి అన్ని వసతులు కల్పిస్తూ.. సర్వే, ఇతర పనులు చేయించుకోవాలన్నారు. ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉదయం ఒక చివర నుంచి మట్టిని తీసి ఎక్సలేటర్‌పై వేస్తూ నీటిని మరోవైపు దారి మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు. సింగరేణి సిబ్బందితో పాటు యాంత్రిక సహకారం తీసుకుంటూ మనుషులు బురదను బయటికి తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. టన్నెల్‌ లోపల పనిచేసే వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, సింగరేణి అధికారులు, ఐఐటీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

కుటుంబసభ్యుల పడిగాపులు..

టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులకు సంబంధించి కుటుంబసభ్యులు దోమలపెంట జేపీ కంపెనీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కంపెనీ యజమానితో మాట్లాడటానికి కుటుంబ సభ్యులు చూస్తుండగా.. కంపెనీ అధికారులు, సిబ్బంది పొంతన లేని సమాధానం చెబుతూ వారిని అక్కడి నుంచే పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఓ కార్మికుడి కుటుంబసభ్యులు కార్యాలయం వద్దకు వచ్చి ఆరా తీశారు. అదే సమయంలో జేపీ కంపెనీ యజమాని హెలీకాప్టర్‌లో వస్తుండటంతో అక్కడి నుంచి వారిని పంపించేశారు.

ఏమైపోయారో.. 1
1/1

ఏమైపోయారో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement