ఈ ఏడాది యాసంగిలో జూరాల కుడి కాల్వ కింద 15 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తామని అధికారులు ముందస్తుగా ప్రకటించారు. సాగుపై మక్కువతో రైతులు కాల్వల ద్వారా నీరందుతుందని వరి పంటలు సాగు చేశారు. వారబందీ విధానంలో నాలుగు రోజులు నీటి సరఫరా ఉండగా.. ప్రస్తుతం రెండ్రోజులకు తగ్గించడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. సమాంతర కాల్వ నుంచి నీటిని తరలించుకుపోతున్నారని.. కుడి, ఎడమ కాల్వలకు మాత్రం సాగునీరు అందించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని అమరచింత, ఆత్మకూర్ రైతులు ఆరోపిస్తున్నారు. సమాంతర కాల్వ షెట్టర్లు తెరిచి వారంలో మూడురోజులు భీమా ఫేజ్–2కు నీటిని తరలిస్తున్నారని.. ఇక్కడి పాలకులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.