సర్వం సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

సర్వం సన్నద్ధం

Mar 4 2025 12:25 AM | Updated on Mar 4 2025 12:25 AM

సర్వం సన్నద్ధం

సర్వం సన్నద్ధం

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

అమరచింత: జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 5నుంచి 25వ తేదీ వరకు జరిగే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో మొత్తం 12,150 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు 6,457 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,693 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 600 మంది ఇన్విజిలేటర్లను నియమించడంతో పాటు నాలుగు సిట్టింగ్‌ స్క్వాడ్స్‌, ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని.. విద్యార్థులు 8:45 గంటలలోగా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్‌ టికెట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి..

ఇంటర్‌ బోర్డు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి అంజయ్య అన్ని పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తూ.. విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లోని అన్ని గదుల్లో విద్యుత్‌ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. డ్యూయల్‌ డెస్క్‌ బెంచీలు, తాగునీటి వసతులను యథావిధిగా కల్పించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా కళాశాలల్లో విద్యార్థులను వార్షిక పరీక్షలకు అన్నివిధాలా సన్నద్ధం చేశారు. పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

సీసీ నిఘాలో..

ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు ఈసారి సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎప్పటికప్పుడు ప్రత్యేక స్క్వాడ్స్‌తో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయనున్నారు. ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ పాల్పడి పట్టుబడితే విద్యార్థులు తమ విలువైన గమ్యాన్ని కోల్పోతారని అధికారులు హెచ్చరిస్తున్నారు.

163 సెక్షన్‌ అమలు..

ఇంటర్‌ పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను పరీక్ష సమ యం ముగిసే వరకు మూసి ఉంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రా సేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు.

ఏర్పాట్లు పూర్తి..

జిల్లాలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 12,150 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు 25 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే విద్యార్థులకు హాల్‌టికెట్లు అందాయి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి.

– ఎర్ర అంజయ్య, డీఐఈఓ

జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాల ఏర్పాటు

హాజరుకానున్న

12,150 మంది విద్యార్థులు

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement