ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 1979–80లో స్థానిక కేడీఆర్ యూపీఎస్‌లో ఏడోతరగతి, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు, 1983–85 వరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఆయనతో కలిసి చదువుకున్న మిత్రులతో పాటు చదువు చెప్పిన గురువులను సైతం ఈ పర్యటనలో కలవనున్నారు. ఈ మేరకు అధికారులు మిత్రబృందం, గురువులు సుమారు 300 మందికి ప్రత్యేక పాసులు జారీ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీరితో ముఖ్యమంత్రి సుమారు రెండు గంటల పాటు గడిపి అక్కడే భోజనం చేయనున్నారు. ఇందుకుగాను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఏర్పాట్లు చేశారు. ఆయన మిత్రుల్లో రైతుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ వ్యాపారులు, రాజకీయ నాయకులు తదితర వర్గాలవారు ఉండటం గమనార్హం.