వనపర్తి: ఆధార్‌కార్డు అన్ని సేవలకు కీలకమని.. ప్రతి ఒక్కరూ వివరాలు, బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు కోరారు. గురువారం సమీకృత కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో యూఐడీఏఐ అసిస్టెంట్ మేనేజర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. పుర కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు వెబెక్స్‌లో హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పౌరసేవలు పొందాలంటే ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి అన్నారు. ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివరాలు పునరుద్ధరించుకోవాలని పేర్కొన్కారు. పుట్టిన శిశువు మొదలు ఐదేళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆధార్ నమోదు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించాలని సూచించారు. ఆధార్‌కార్డులో చిన్న మార్పులకు నివాస ధ్రువపత్రం సరిపోతుందని.. జన్మతేదీ సవరణకు జనన ధ్రువీకరణపత్రం అవసరమని స్పష్టం చేశారు. జనన ధ్రువీకరణపత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని పుర కమిషనర్లు, ఆర్డీఓను ఆదేశించారు. విద్యార్థులు అపార్ కార్డు నమోదుకు ముందు ఆధార్ వివరాలు సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. పాఠశాలల్లోనే బయోమెట్రిక్ అప్‌డేట్ చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఆధార్ నమోదు, అప్‌డేట్ కోసం క్యాంపులు నిర్వహించాలని సూచించారు. నవీకరణ ప్రక్రియకు సంబంధించి ఆధార్ సేవాకేంద్రాలకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ–డిస్ట్రిక్ మేనేజర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, యూఐడీఏఐ అసిస్టెంట్ మేనేజర్ సత్యకళ, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్, ఈడీఎం విజయ్ తదితరులు పాల్గొన్నారు.