కనిపించని పురోగతి | - | Sakshi
Sakshi News home page

కనిపించని పురోగతి

Feb 27 2025 1:18 AM | Updated on Feb 27 2025 1:18 AM

కనిపి

కనిపించని పురోగతి

ఐదు రోజులైనా దొరకని కార్మికుల జాడ

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో

చిక్కుకున్న 8 మంది కోసం

భగీరథ యత్నం

నీరు, బురద తొలగించడం

పెద్ద సవాలే..

రెండ్రోజుల్లో

తీసుకొస్తామన్న మంత్రులు

అచ్చంపేట/అచ్చంపేట రూరల్‌/ ఉప్పునుంతల: దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రమాదం జరిగి ఐదు రోజులైనా ఇంత వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం న్యూఢిల్లీలోని బార్డర్స్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌, టన్నెల్‌ వర్క్స్‌లో నిష్టాతులైన వారిని ప్రత్యేకంగా పిలిపించారు. సొరంగంలోకి వెళ్లి వచ్చిన రెస్క్యూ బృందాలు మాత్రం శిథిలాలను తొలగించడం.. అందులో చిక్కుకున్న కార్మికులను కాపాడటం కష్టంగా ఉందని చెబుతున్నారు. సొరంగంలో భారీగా మట్టి, రాళ్లు కూలి పడటంతో.. వాటిని కదిలిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శిథిలాలు, మట్టిని తొలగించేందుకు రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. కాగా, ఉత్తరఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 41 మందిని రక్షించినప్పటికీ అక్కడికి ఇక్కడికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రయత్నాలు చేయడం కూడా కష్టంగా మారిందని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. దేశంలో ఇప్పటివరకు జరిగిన టన్నెల్‌ ప్రమాదాల్లో ఇదే అత్యంత కఠినమైనదని చెబుతున్నారు. అయితే 12 కి.మీ. వద్ద మరో మార్గం ద్వారా లోపలికి వెళ్లాలని సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. సొరంగంపై నుంచి లేదా పక్క నుంచి రంధ్రం చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రయత్నాలు చేస్తున్నారు.

అంతుచిక్కడం లేదు..

సొరంగంలో చేరిన నీటిని, బురదను తొలగించి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడటం పెద్ద సవాల్‌గా మారింది. ఈ ప్రమాదాన్ని అంచనా వేయడం నిపుణులు, ఇంజినీర్లు, రెస్క్యూ బృందాలను సైతం కలవరపెడుతోంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన వారికి ఈ ప్రమాదం అంతుచిక్కుడం లేదు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలనే దానిపై ఇప్పటి వరకు ఓ నిర్ణయానికి రాలేదు. లోపల ఉన్న బురద, రాళ్లు, నీటిని బయటికి తీసుకురావడం కష్టమన్న భావన వ్యక్తమవుతోంది. తెగిపోయిన కన్వేయర్‌ బెల్టును కూడా ఇప్పటి వరకు పునరుద్ధరించ లేదు. వాస్తవానికి టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ నడిస్తేనే ఈ బెల్టు పని చేస్తుంది.

కార్మికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన..

సొరంగంలో చిక్కుకున్న వారు ఎక్కుడున్నారో.. ఎలా ఉన్నారో అనే ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. టన్నెల్‌ వద్దకు తమను పంపడం లేదని.. షెడ్‌లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని వాపోతున్నారు. ఎలాంటి సమాచారం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని.. రోజుకు రెండు, మూడు హెలిక్యాప్టర్లు రావడం చూసి ఏమైందోనన్న ఆందోళన చెందుతున్నామని గోడు వెలిబుచ్చారు.

మంత్రుల పర్యవేక్షణ..

దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద చేపట్టిన సహాయక చర్యలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌మార్‌రెడ్డి, రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఉన్నతాధికారులు, జేపీ కంపెనీ, వివిధ రెస్క్యూ బృందాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను రెస్క్యూ బృందాలు మంత్రుల దృష్టికి తీసుకువచ్చాయి. గాలి, వెలుతురు లేని సొరంగంలో ఆక్సిజన్‌ అందకపోవడంతో సహాయక బృందాలు ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాయని.. ఆక్సిజన్‌ సిలిండర్లు సమకూర్చితే లోపల ఎక్కువ సమయం ఉండేందుకు అవకాశం ఉంటుందని.. ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వ్యూహాలు రచించవచ్చని తెలిపారు.

కనిపించని పురోగతి 1
1/1

కనిపించని పురోగతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement