● ఎస్పీ ఏఆర్ దామోదర్
విజయనగరం టౌన్: ఎవరైనా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలే కానీ, లేని సమస్యలను సృష్టించడం, స్వలాభం కోసం విద్యార్థులను రెచ్చగెట్టడం సరికాదని విద్యార్థి సంఘాల నాయకులకు ఎస్పీ ఏఆర్.దామోదర్ హితవు పలికారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసు ఉద్యోగ నియామకాలను పెద్ద సంఖ్యలో చేపట్టాలని ఆందోళనలు చేపడుతున్న విద్యార్థి సంఘాల ఉచ్చులో పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘం నాయకులు తమ రాజకీయ ఎదుగుదలకు నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి, వారు చేపట్టే నిరసన, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పావులుగా వాడుకుంటున్నారన్న వాస్తవాన్ని యువత గుర్తించాలని హితవు పలికారు. విద్యార్థి సంఘాల నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగ యువతను ప్రలోభపెట్టి, రెచ్చగొట్టి వారిని హింసా మార్గంలోకి తీసుకువెళ్లి, క్రిమినల్ కేసుల్లో నిందితులుగా చేసి, తమ సంఘాల్లో వారు పనిచేసే విధంగా చేస్తున్నారన్నారు. విద్యార్థిసంఘాల ఉచ్చులో పడిన నిరుద్యోగ యువతపై ఇప్పటికే రెండు క్రిమినల్ కేసులు నమోదుచేశామన్నారు. ఎవరైనా క్రిమినల్ కేసుల్లో ఒకసారి నిందితులుగా చేరితే, వారి భవిష్యత్తు నాశనమైనట్లేనని, భవిష్యత్తులో వారు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు ఎంపికై నా క్రిమినల్ కేసుల కారణంగా ఉద్యోగాలు పొందే అవకాశాలను కోల్పోతారని స్పష్టం చేశారు. ఉద్యోగాలు సాధించడానికి ఏకాగ్రత, అంకితభావం, క్రమశిక్షణతో, నిరంతర సాధన చేయాలని, నిరుద్యోగయువతకు ఎస్పీ పిలుపునిచ్చారు.


