కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సహకారంతో 350 మంది దివ్యాంగులకు కృత్రిమ ఆవయవాలు, ఉపకరణాలను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రఘురాం మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ముందుగా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, కేన్సర్ ఆస్పత్రి, కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. దివ్యాంగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.కృత్రిమ అవయవాల తయారీ విధానాన్ని ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు సమగ్రంగా వివరించారు. అనంతరం రఘురాం మాట్లాడుతూ గురుదేవా చారిటబుల్ ట్రస్టు దివ్యాంగుల సేవలో పరితపిస్తోందన్నారు. వారికి నడక నడత నేర్పి ఎంతో సహకారం చేస్తోందని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులకు ఉచితంగా ట్రైసెకిల్స్, పోలియో కాలిపవర్స్, చెవిటి మిషన్‌లు, వీల్‌చైర్స్, వాకింగ్ స్టిక్స్‌ను అందజేశారు. అనంతరం పలువురు వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్ అధికారులు పాల్గొన్నారు.


