చీపురుపల్లి రూరల్ (గరివిడి): తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ఇటు అధికారులు..అటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కొండపాలెం ప్రజలు గరివిడి మేజర్ పంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయమైన తాగునీటిని అందించడంలో అధికార యంత్రాంగం, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు గత మూడు నెలలుగా తాగునీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కొండపాలెం ప్రజలు చివరకు విసుగెత్తి గరివిడి మేజర్ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో కొండపాలెం ప్రాంతానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, నీటి సమస్యను ఎదుర్కొంటున్న వారంతా కలిసి ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. ‘తాగునీరు లేకపోతే ప్రజలు ఎలా బతకాలి’? అంటూ అధికారులను ప్రశ్నిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు బొంపల్లి వెంకటరావు, శివుకు కాంతారావు, శ్రీను, జమ్ము వెంకటరావు తదితరులు మాట్లాడుతూ కొండపాలెంతో పాటు డీఎఫ్‌ఎనన్ ఏరియా, జె–టైప్ క్వార్టర్స్, టూరింగ్ క్వార్టర్స్, రేకుల షెడ్ ఏరియా ప్రజలు కూడా తాగునీటి సరఫరా లేక అవస్థలు పడుతున్నారని, నెలల తరబడి సమస్య కొనసాగుతున్నా పట్టించుకోని అధికారుల తీరుపై మండిపడ్డారు. 45 రోజులుగా కరెంటు సమస్యతో పాటు గుజ్జింగివలస వద్ద మోటార్ రిపేర్ అయ్యి, నీటి సరఫరా వ్యవస్థ నిలిచిపోయినా, దానిని మరమ్మతు చేయడంలో ఎందుకు జాప్యం జరిగిందని ప్రశ్నించారు. ఒక మోటార్ మరమ్మతుకు, కరెంటు సమస్యకు ఇన్ని రోజులు పడుతుందా? లేక ప్రజల తాగునీటి సమస్య అధికారులకు పట్టదా? అంటూ నిలదీశారు. ప్రజల దాహార్తిని తీర్చాల్సిన బాధ్యత ఉన్న గరివిడి మండల స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి ఎమ్మెల్యే వరకు, అలాగే సంబంధిత అధికారుల వరకు సమస్యపై స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది..ప్రజలు తాగు నీటి కోసం అల్లాడుతుంటే పాలకులు, అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాన రహదారిపై బైఠాయింపు
గరివిడి మేజర్ పంచాయతీ
కార్యాలయం ముట్టడి
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై ప్రజాగ్రహం
రంగప్రవేశం చేసిన పోలీసులు
రోడ్డుపై బైఠాయింపు..రంగంలోకి పోలీసులు
మేజర్ పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందులతో ఆందోళన చేసి అనంతరం ప్రధాన రహదారిపై ప్రజలు బైఠాయించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఎస్సై లోకేశ్వరరావు పోలీసులతో రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఈవో వేణుగోపాల్ స్పందిస్తూ..గుజ్జింగివలస వద్ద మోటార్ కాలిపోవడం, సుమారు 45 రోజులుగా విద్యుత్ అంతరాయం ఏర్పడడం వల్లే తాగునీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. మోటార్‌కు మరమ్మతులు పూర్తి చేసి మంగళవారం సాయంత్రం కొండపాలెం గ్రామానికి తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కొండపాలెం, డీఎఫ్‌ఎనన్‌్, జె–టైప్ క్వార్టర్స్, టూరింగ్ క్వార్టర్స్, రెగ్యుల్ షెడ్ ప్రాంతాలకు రోజు విడిచి రోజు తాగునీరు అందిస్తామని వెల్లడించారు.


