● బాధ్యులపై చర్యలు తప్పవు
● జేఎన్‌టీయూ జీవీ ఉపకులపతి
వి.వి.సుబ్బారావు
విజయనగరం రూరల్: జిల్లాలో ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం – గురజాడ విజయనగరంలో గత కొన్నేళ్లుగా జవాబుపత్రాల్లో జరుగుతున్న మార్కుల ట్యాంపరింగ్ వివాదంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశామని వర్సిటీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు తెలిపారు. ఇటీవల మార్కుల ట్యాంపరింగ్‌పై ఈ నెల 7న ఫిర్యాదులు అందడంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపగా ఐదుగురు విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వేసి ఉత్తీర్ణత చేసినట్లు విచారణలో తేలింది. అయితే, అసలు దొంగలు తప్పించుకుని పరీక్షా విభాగానికి ఏ సంబంధం లేని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సనపతి సంతోష్‌పై నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సంతోష్ మానసిక ఆందోళనతో మూడు రోజుల కిందట నాలుగు పేజీల సూసైడ్ లేఖ రాసి తన స్వగ్రామంలో ఆత్మాహత్యాప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతిచెందాడు.
నలుగురు కాంట్రాక్ట్ ప్రొఫెసర్లపై ఆరోపణలు
సంతోష్ తన సూసైడ్ లేఖలో వర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ముగ్గురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే మార్కుల ట్యాంపరింగ్‌లో కీలక సూత్రదారులని పేర్కొన్నారు. ఇది కొద్ది రోజులుగా జరుగుతున్న తంతుకాదని, తాను ఉద్యోగంలో చేరకముందు నుంచే గత మూడు నాలుగేళ్లుగా జరుగుతుందని పేర్కొన్నాడు. మూడేళ్ల నుంచి జవాబు పత్రాలను పరిశీలిస్తే దోషులు ఎవరో తేలుతుందని, వర్సిటీ ఉపకులపతి దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు.
ట్యాంపరింగ్ నిజమే
ఈ విషయమై ఉపకులపతి వి.వి.సుబ్బారావును వివరణ కోరగా తమకు అందిన సమాచారం మేరకు జవాబు పత్రాలను పరిశీలించగా ఐదుగురు విద్యార్థులకు వారికి వచ్చిన మార్కులు కంటే అధికంగా మార్కులు వేసి ట్యాంపరింగ్ చేసినట్టు గుర్తించామని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. గత మూడేళ్లు జవాబు పత్రాలను పరిశీలించేందుకు కమిటీ వేశామని, వారి విచారణలో మార్కుల ట్యాంపరింగ్ జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.


