విజయనగరం క్రైమ్: క్రికెట్ బెట్టింగ్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘బెట్టింగ్ మాయాజాలం‘ అనే షార్ట్ ఫిల్మ్ ను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ డీపీఓలోని తన చాంబర్‌లో బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ యువత క్రికెట్ బెట్టింగులకు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోవడంతో పాటు, చదువులను నిర్లక్ష్యం చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. క్రికెట్ బెట్టింగులు, ఇతర ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత ఏవిధంగా ప్రభావానికి గురవుతున్నది, వారి జీవితాలను ఏవిధంగా నాశనం చేసుకుంటున్నది, డబ్బులను ఎలా నష్టపోతున్నది అన్న విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ‘బెట్టింగ్ మాయాజాలం‘ అనే షార్ట్ ఫిల్మ్ ను రూపొందించామన్నారు. ఈ షార్టు ఫిల్మ్ ను పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామ సందర్శన, కళాశాలల్లో నిర్వహించే అవగాహన సదస్సుల్లోను ప్రదర్శించి, బెట్టింగుల వలన కలిగే అనర్థాలను వివరిస్తారని ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది ప్రజలకు చేరే విధంగా చర్యలు చేపడతామన్నారు. బెట్టింగులను నియంత్రించేందుకు పోలీసు అధికారులు తమ స్టేషన్ పరిధిలోని లాడ్జిలు, హాస్టల్స్, విద్యార్థులు, యువత ఎక్కువగా గుమిగూడే కళాశాలలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తనిఖీలు చేపట్టే సమయంలో యువత మొబైల్ ఫోన్లను పరిశీలించి, వారి మొబైల్స్ లోని బెట్టింగ్ యాప్‌లు తొలగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సిఐ కె.కుమారస్వామి పాల్గొన్నారు.


