సాలూరు: సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా సాలూరు నియోజకవర్గ రిపోర్టర్ నల్లి శ్రీనివాసరావుపై బుధవారం ముగ్గురు అగంతకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఎంపీడీఓ కార్యాలయంలో వార్తా సేకరణ ముగించుకుని సహచర విలేకరితో కలిసి బైక్‌పై వస్తుండగా వెంబడించారు. సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే వారిని అడ్డగించి, పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘాతుకంలో శ్రీనివాసరావు తలకు తీవ్రగాయమైంది. రక్తస్రావంతో స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి బాధితుడిని సాలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడిని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజా గొంతుకగా నిలిచే విలేకర్లపై దాడులను ఖండించారు. ఈ విషసంస్కృతి సరికాదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న మీడియా వ్యక్తులను ముఖ్యంగా సాక్షిటీవీ, ప్రింట్‌మీడియా రిపోర్టర్లను లక్ష్యంగా చేసుకుని చేపడుతున్న దాడులు ఎవరి ప్రమేయంతో, ఎవరి సహాయంతో జరుగుతున్నాయి, దీనివెనుక ఎవరున్నారనే విషయాలు అందరికీ అర్థమవుతున్నాయన్నారు. దీనిపై పోలీసులు లోతుగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలోని సాలూరు వంటి ప్రశాంతమైన ప్రాంతంలో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు బాధాకరమన్నారు. మీడియాను భయపెడితే అరాచకాలు, అక్రమాలు, దురాఘాతాలు సాఫీగా సాగిపోతాయని కొందరు భావిస్తున్నట్టుందన్నారు. దాడులను మీడియా శ్రేణులంతా ఐక్యంగా ఖండించాలని కోరారు. రిపోర్టర్‌పై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులను, వారి వెనుక ఉన్నవారిని పోలీసులు పట్టుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి సంధ్యారాణి హయాంలో ప్రశాంతమైన సాలూరు బీహార్‌ను తలిపిస్తోందన్నారు. గతంలో సాలూరు మండలం మరిపల్లి గ్రామానికి చెందిన గిరిజన ఎంపీటీసీ సభ్యులు జన్ని సీతారాంను జుట్టుపట్టుకుని కొట్టారని, మక్కువలో ప్రజాశక్తి విలేకరిపై దాడిచేశారని, సాలూరు మెంటాడ వీధిలో పప్పల మోహన్‌పై దాడి జరిగిన సంఘటలను గుర్తుచేశారు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చగా పేర్కొన్నా రు. నిందితులను పట్టుకోకుంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
పార్వతీపురం రూరల్: విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై జరిగిన భౌతిక దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని పేర్కొంది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావుకు యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. పోలీస్ స్టేషన్ సాక్షిగా ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టారంటే జిల్లాలో విలేకరుల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని ధ్వజమెత్తారు. ముందస్తు పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగితే జిల్లావ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు గంగి శ్రీనివాసరావు, ఆర్.సుధాకర్, గోపాల్, దుర్గా, అనంతరావు, సాక్షి స్టాఫర్ రామకృష్ణ, నవీన్, దివానీ, సోమశేఖర్, కాకిముక్కల నాగు, శేఖర్, శాస్త్రి, శంకరరావు, నాయుడు, కృష్ణ, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.
అమానుషం
సాలూరు రూరల్: సాక్షి సాలూరు టీవీ రిపోర్టర్ శ్రీనివాస్‌పై బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ పార్వతీపురం మన్యం జిల్లా నాయకులు హెచ్.సింహాచలం, బి.అనిల్ ఖండంచారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విలేకర్ల పైదాడి మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు. వారి వెంట ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సురేష్, ఎ.గంగారావు ఉన్నారు.
సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్‌పై హత్యాయత్నం
దుండగుల దాడితో తీవ్ర గాయాలు
నిందితులను తక్షణమే అరెస్టు
చేయాలంటూ జర్నలిస్టు సంఘాల ఆందోళన
బాధితుడిని పరామర్శించిన జెడ్పీ చైర్మన్, మాజీ డిప్యూటీ సీఎం


