విజయనగరం ఫోర్ట్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనరిక్ మెడికల్ షాపుల్లో ఖాళీగా ఉన్న ఫార్మసిస్టు పోస్టులకు మే 5న ఉదయం 11 గంటలకు రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు చైర్మన్ ప్రసాదరావు తెలిపారు. అర్హతగల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతలకు సంబంధించి ఒరిజనల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు. ఎంపికై న వారు చైర్మన్/కార్యదర్శి ఎదుట ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు.
పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వానికి నివేదిక
● కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి
రామభద్రపురం: ఉపాధిహామీ నిధులతో చేపట్టిన పల్లెపండగ పనులకు బిల్లులు పెండింగ్ ఉన్నమాట వాస్తవమేనని, పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపామని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యసేవలు, మందుల నిల్వలపై ఆరా తీశారు. ఆస్పత్రి గదులు శిథిలావస్థకు చేరాయని, వర్షానికి కారిపోతున్నట్టు వైద్యాధికారులు లక్ష్మి, దిలీప్‌కుమార్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందిస్తూ ఏపీఎంఐసీ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తానని చెప్పారు. ఓపీ పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విలేకర్లతో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ వేతనదారులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వానికి నివేదించామని, త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే బంకు యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అజూ రఫీజాన్ పాల్గొన్నారు.
హెచ్‌టీ పత్తి విత్తనాలు విక్రయిస్తే ఐదేళ్ల జైలుశిక్ష
వీరఘట్టం: హెర్బిసైట్ టాలరెంట్(హెచ్‌టీ) పత్తి విత్తనాలతో జీవ వైవిద్యానికి తీవ్ర ముప్పు ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయ ఏడీఏ ఆర్.శశిధర్‌రెడ్డి, ఏఓ కె.ఆంజనేయకుమార్ పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆ విత్తనాలను నిషేధించిందని స్పష్టం చేశారు. వీరఘట్టం మండలంలోని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాల్లో బుధవారం తనిఖీలు చేపట్టారు. నిషేధిత హెచ్‌టీ విత్తనాలు విక్రయిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమాన ఉంటుందని ఎరువుల షాపుల యాజమాన్యానికి తెలిపారు. హెచ్‌టీ విత్తనాలతో సాగు చేయడం వల్ల సూపర్ కలుపు మొక్కలు ఏర్పడి ఇతర పంటలను నాశనం చేస్తుందన్నారు. దీని ప్రభావం మనుషులపై కూడా ఉంటుందన్నారు. వారితో మండల వ్యవసాయశాఖ అధికారిణి జక్కువ సౌజన్య ఉన్నారు.
మే 10లోగా భూరికార్డుల పరిశీలన పూర్తిచేయాలి
పార్వతీపురం: రానున్న మే 10వ తేదీలోగా భూ రికార్డుల పరిశీలన పూర్తిచేయాలని, మే 13వ తేదీ నాటికి మ్యుటేషన్ పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మే 17వ తేదీ నాటికి ఆధార్, డేటా సవరణలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో కె.హేమలత, తదితరులు పాల్గొన్నారు.


