విజయనగరం టౌన్: ఉత్తరాంధ్ర జిల్లాలు కథలకు పుట్టినిల్లు అని మరోసారి రుజువైందని, డాక్టర్ డీవీజీ శంకరరావు కథలు చుక్కానిలా ఉన్నాయని సాహితీవేత్త అట్టాడ అప్పలనాయుడు అన్నారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో చీకటి దివాకర్ అధ్యక్షతన మహాకవి శ్రీశ్రీ జయంతి, మేడే పురస్కరించుకుని డాక్టర్ డీవీజీ శంకరరావు కథల సంపుటి పుస్తకావిష్కరణను జెడ్పీ మీటింగ్ హాల్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్‌టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ ఎం.జై చంద్రనాయుడు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. అణగారిన వర్గాల కోసం, స్వేచ్ఛాజీవనం కోసం, కార్మికుల హక్కుల కోసం, ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం శ్రీశ్రీ రచనలు చేశారన్నారు. డాక్టర్ ఎం.రమాగీతాదేవి, పాయల మురళీకృష్ణ పుస్తక సమీక్ష చేశారు. డీవీజీ రచనలు మానవత్వాన్ని మృదువుగా తాకే స్పర్శ రేఖలని, వైద్యునిగా పొందిన అనుభవాలు, జీవిత సత్యాలు వారి కలంలో జీవం పోసుకుని మన ముందుకు వచ్చాయన్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన షేక్ భాషా, కె.వి.శేషారావు, ఎల్.ఆర్.స్వామిలకు సభ నివాళులర్పించింది. ఎస్.శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, డాక్టర్ గుల్లిపల్లి జయపాలరావు, రొంగలి పోతన్న, పీవీఎస్.శ్రీనివాసరావు, స్వర్ణలత, చీకటి చంద్రిక, తదితరులు పాల్గొన్నారు.


