● జిల్లా పోలీస్ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదు
● ఏఎస్పీ సౌమ్యలతకు వినతిపత్రం
అందజేత
విజయనగరం: వైఎస్సార్‌సీపీ నాయకులు, మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కూటమి ప్రభుత్వం తప్పులను కప్పిపుచ్చేలా వ్యవహరిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల అధినేత రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఈ నెల 9వ తేదీన జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు చేసిన ఫిర్యాదులపై తాత్సారం చేయడం తగదంటూ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ సౌమ్యలతకు సోమవారం ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాధాకృష్ణకు చెందిన ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో వైఎస్సార్‌సీపీ నాయకుల మనోభావాలు దెబ్బతినేలా వాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, పార్టీ నాయకులు డోల మన్మథకుమార్, మారం బాలబ్రహ్మారెడ్డి, పిన్నింటి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


