వేసవి సెలవులు
ఎండలతో పిల్లలకు ఇబ్బంది..
ఎండలు చూస్తే భయంకరంగా ఉన్నాయి.అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లేందుకు పిల్లలు ఎండ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతతో ఏడుస్తున్నారు. ఎండల ప్రభావం పిల్లల ఆరోగ్యంపై పడుతుందేమోనని భయంగా ఉంది.అరగంటకోసారి వారికి నీళ్లు తాగిస్తున్నాం.ప్రభుత్వం వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నెల రోజుల పాటు సెలవులు ఇస్తే బాగుంటుంది.
– మరడ జ్యోతి,చిన్నారి తల్లి,రామభద్రపురం
రామభద్రపురం: తీవ్రమైన ఎండలకు భయపడి విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ నుంచే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులిచ్చింది.కానీ పాఠశాల స్ధాయి కంటే చిన్న వయస్సుగల చిన్నారులుండే అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రం సెలవులు ఇవ్వలేదు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు కొన్ని భవనాల్లో, మరికొన్ని పెంకుటిళ్లలో, ఇంకొన్ని రేకులున్న గదుల్లో అంతంత సౌకర్యాల నడుమ కొనసాగుతున్నాయి.ప్రస్తుతం మండుతున్న ఎండలకు అంగన్‌వాడీ గదులు వేడెక్కుతున్నాయి. రేకుల గదుల్లో ఉన్న వాటి పరిస్ధితి అయితే చెప్పనక్కర్లేదు.తీవ్రమైన ఉష్ణోగ్రత చిన్న పిల్లలపై త్వరగా ప్రభావం చూపే అవకాశం ఉంది. డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో గర్భిణులు 7388మంది, బాలింతలు 7492 మంది ఉన్నారు. అలాగే 3 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు 20,127మంది, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 35,482మంది, 6 నెలల లోపు చిన్నారులు 6913మంది ఉన్నారు. అయితే మండుతున్న ఎండల వల్ల చిన్నారులను కేంద్రాలకు తీసుకురావడం, వారికి ప్రతి అరగంటకోసారి నీళ్లు తాగించడం, అన్నీ చూసుకోవడం అంగన్‌వాడీ టీచర్లకు కష్టంగా మారుతోంది. ఎండల ప్రభావానికి వారికేదైనా జరిగితే పిల్లల తల్లిదండ్రులు తమను నిందిస్తారని భయపడుతున్నారు.
సమయ మార్పిడితో సరి..
మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఈ నెల నుంచి అంగన్‌వాడీల పని వేళల్లో మార్పులు చేసింది. సాధారణంగా ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు పని చేయాలి.ప్రస్తుతం ఈ సమయాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటలకు కుదించింది.అయితే నిప్పులు కక్కుతున్న భానుడి ప్రభావానికి ఉదయం 11 గంటల సమయానికి 40 డిగ్రీలకు ఎండవేడి చేరుకుంటోంది. సమయవేళలు మార్చినప్పటికీ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయని, సెలవులు ఇవ్వాలని అంగన్‌వాడీ టీచర్లతోపాటు పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
తల్లిదండ్రులు పిల్లలను
పంపడంలేదు...
ఎండల ప్రభావానికి పెద్దవాళ్లే తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది చిన్నపిల్లలు ఎలా తట్టుకుంటారు. చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నాం. అరగంటకోసారి వారికి నీళ్లు తాగిస్తున్నాం.అయినా భయంతో తల్లిదండ్రులు వారి పిల్లల్ని అంగనవాడీలకు పంపడంలేదు. పిల్లలను త్వరగా వదిలేస్తామని వారికి సర్దిచెప్పి కేంద్రాలకు తీసుకువస్తున్నాం.
– సీహెచ్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్, రామభద్రపురం
ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు..
అంగన్‌వాడీ కేంద్రాల టీచర్, హెల్పర్లకు మే 1 నుంచి 15 తేదీ వరకు ఒకరికి, 16 నుంచి 31 వరకు మరొకరికి వేసవి సెలవులు ఇవ్వాలని కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కానీ పిల్లలకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు రాలేదు. అయినా ప్రభుత్వం పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సెలవులు ఇస్తే లబ్ధిదారులకు ఫుడ్‌గ్యాప్ వస్తుందని సెలవులు ఇవ్వడం లేదు.
– కేవీ బాలామణి, ఐసీడీఎస్ పీడీ, విజయనగరం
తీవ్రమైన ఎండలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలు
చిన్నారులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం
పిల్లల్ని కేంద్రాలకు పంపడానికి
జంకుతున్న తల్లిదండ్రులు
అంగన్‌వాడీల పనివేళల్లో మార్పుతో సరిపెట్టిన ప్రభుత్వం
పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వాలని కోరుతున్న తల్లిదండ్రులు


