జీడి పిక్కల కొనుగోలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జీడి పిక్కల కొనుగోలు ప్రారంభం

Apr 16 2026 10:42 AM | Updated on Apr 16 2026 10:42 AM

గుమ్మలక్ష్మీపురం: మన్యంలో జీడి పిక్కల కొనుగోలు ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే జీడి పిక్కలు దిగుబడి అవుతుండడంతో వాటిని సేకరించే పనిలో జీడి రైతులు నిమగ్నమవుతున్నారు. జీడి పిక్కలను జిసీసీ, ఐటీడీఏ, వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాల ద్వారా కొనుగోలు చేపట్టేందుకు ప్రభుత్వాధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఎప్పటిలాగానే ఈ ఏడా ది కూడా స్థానిక వ్యాపారులే జీడిపిక్కలకు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు కిలో జీడి పిక్కలను రూ.157కు కొంటున్నారు. పూత పింద దశల్లో బాగున్నా..దిగుబడులు మాత్రం ఈ ఏడాది ఆశాజనకంగా లేదని గిరి జన రైతులు వాపోతూ, కిలోకు మద్దతు ధర రూ.200కు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

హెల్త్‌ స్కీమ్‌ గడువు పెంపు

పార్వతీపురం: వర్కింగ్‌ జర్నలిస్టు హెల్త్‌ స్కీంను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్‌ నంబర్‌ 43 జారీ చేసింది. ఈస్కీంలో జర్నలిస్టు ప్రీమియం రూ. 2,500 కాగా జర్నలిస్టు వాటాగా రూ.1250, ప్రభుత్వం రూ.1250 చెల్లిస్తుంది. అక్రిడేషన్‌ ఉన్న జర్నలిస్టులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సీఎఫ్‌ఎంఎస్‌.ఏపీ.జీఓవీ.ఇన్‌ ద్వారా రూ.1250 చెల్లించి లబ్ధి పొందవచ్చునన్నారు. ప్రీమియం చెల్లించిన వారు చలానా, కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఆధార్‌, ఫొటోలు తదితర పత్రాలను కార్యాలయాలకు సమర్పించాలన్నారు. ఈ స్కీమ్‌ జర్నలిస్టులు వారి భార్య, పిల్లలు, ఆధారిత తల్లిదండ్రులకు వర్తిస్తుందని పేర్కొన్నారు.

పదోన్నతితో మరింత బాధ్యతగా విధులు నిర్వహించాలి

విజయనగరం క్రైమ్‌: పదోన్నతితో విధులు మరింత బాధ్యతగా నిర్వహించాలని ఎస్పీ దామోదర్‌ అన్నారు. పోలీసుశాఖ సివిల్‌ విభాగంలో పనిచేస్తున్న 21మంది సిబ్బందికి ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుల్స్‌గా పదోన్నతులను కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఎస్పీ దామోదర్‌ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసి, వారికి స్వీట్స్‌ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి సేవలు, క్రమశిక్షణ, పనితీరు, సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఇచ్చామన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, శాఖకు మంచి పేరు తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్‌ వెంకటలక్ష్మి, జూనియర్‌ సహాయకురాలు చాముండేశ్వరి, డీఎస్పీలు ఆర్‌.గోవిందరావు, ఎస్‌.రాఘవులు, ఎం.వీరకుమార్‌, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, జిల్లా పోలీస్‌ శాఖ అడ్‌హాక్‌ ప్రెసిడెంట్‌ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

భార్య హంతకుడికి జీవిత ఖైదు

విశాఖ లీగల్‌: అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యను వివాహేతర సంబంధం నెపంతో అతికిరాతకంగా హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు విధిస్తూ విశాఖ నగరం ఆరో అదనపు జిల్లా కోర్టు కం మహిళా కోర్టు న్యాయమూర్తి వి.శ్రీనివాసరావు బుధవారం తీర్పునిచ్చారు. జైలు శిక్షతోపాటు రూ.10 వేలు జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో అదనంగా ఆరు నెలలు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసుపై ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.ఖజానారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెదతాడివాడ గ్రామానికి చెందిన ధవలేశ్వరం పంచముఖేశ్వర రావు అలియాస్‌ ఈశ్వరరావు (56) విశాఖ నగరంలోని శ్రీకృష్ణాపురం జైలు రోడ్డు దగ్గర భార్యా పిల్లలతో నివసించేవాడు. వ్యసనాలకు బానిసైన నిందితుడు ఏ పనిచేయకుండా జులాయిగా తిరుగుతూ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ గొడవలు పడడంతోపాటు ఆమెను శారీరకంగా హింసించేవాడు. భర్త ఆగడాలను భరించలేక ఆమె నగరంలోని టూటౌన్‌ ప్రాంతానికి వచ్చి పిల్లలతో నివసించేది. కొంతకాలం గడిచిన తర్వాత నిందితుడు భార్య వద్దకు వచ్చి కలిసి ఉంటానని చెప్పి అందర్నీ నమ్మించాడు. కొంతకాలం కలిసి ఉన్నారు. అయినా నిందితుడికి భార్యపై అనుమానం ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో 2022 అక్టోబర్‌ 20వ తేదీన భార్యాభర్తలు గొడవపడ్డారు. నిందితుడు ముందుగా తెచ్చుకున్న కత్తితో భార్యను తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాల మధ్య ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement