సర్వజన ఆస్పత్రిలో అకస్మాత్తుగా రోగి మృతి | - | Sakshi
Sakshi News home page

సర్వజన ఆస్పత్రిలో అకస్మాత్తుగా రోగి మృతి

Apr 16 2026 10:42 AM | Updated on Apr 16 2026 10:42 AM

సర్వజన ఆస్పత్రిలో అకస్మాత్తుగా రోగి మృతి

పోలీసులు, సూపరింటెండెంట్‌కు బంధువుల ఫిర్యాదు

ఆస్పత్రిలో బైఠాయింపు

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓ రోగి ఆకస్మాత్తుగా మృతిచెందాడు. దీంతో మృతికి గల కారణాలు చెప్పాలని మృతుడి బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గరివిడికి చెందిన ఆర్‌. గోపాలకృష్ణ(53) బైక్‌పై వెళ్తూ కింద పడిపోయాడు. గాయాలు కావడంతో కుటుంబసభ్యులు మంగళవారం అర్ధరాత్రి 12:15 గంటల ప్రాంతంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్‌ వైద్య పరీక్షలు నిర్వహించి ఎంఎస్‌ వార్డులో చేర్పించారు. అయితే బుధవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా రక్తం కక్కుకుంటూ గోపాలకృష్ణ మృతి చెందాడు. అప్పటివరకు మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా ఎలా చనిపోతాడు. మీరు సక్రమంగా వైద్యం చేయకపోవడం వల్లే మృతి చెంది ఉంటాడు. మృతికి గల కారణాలు తెలియకుండా కదిలేదిలేదని బంధువులు ఆస్పత్రిలో బైఠాయించి అక్కడి వైద్య సిబ్బందిని గదిలో పెట్టి బంధించారు. అనంతరం పోలీసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అల్లు పద్మజకు ఫిర్యాదు చేశారు. దీంతో మృతికి గల కారణాలు తేల్చేందుకు పోస్టుమార్టం చేయిస్తామని పోలీసులు చెప్పడంతో మృతుని బంధువులు శాంతించారు. గురువారం గ్రూప్‌ ఆఫ్‌ డాక్టర్స్‌ పోస్టుమార్టం చేస్తారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement