వారి హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి
దివంగత నేత డాక్టర్ వైఎస్సార్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి నోచుకుందని మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తే, జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మూలపాడు పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్ట్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.
విజయనగరం: అమరావతి స్థానంలో మాజీ ముఖ్య మంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్) అంశానికి అధిక మంది ప్రజలు, మేధావులు మద్దతు తెలుపుతుండడం కూటమి ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తోందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ అంశాన్ని పక్కకుతప్పించేందుకు సీఎం చంద్ర బాబు డైవెర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారని విమర్శించారు. అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చులో 10 శాతం ఖర్చు చేస్తే మావిగన్ కారిడార్ అభివృద్ధి చేసుకోవచ్చని, అయితే టీడీపీ నేతలు తమ స్వార్థ ఆర్ధిక ప్రయోజనాలకోసం పాకులాడటం దురదృష్టకరమన్నారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో అసలు సమస్యలపై చర్చ జరగకుండా దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘మావిగన్’ వంటి కీలక అంశాన్ని పక్కదారి పట్టించేందుకే మంత్రి అచ్చెన్నాయుడు అనవసరంగా దశాబ్దాల కిందట జరిగిన విషయాలను లేవనెత్తుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ ప్రస్తావించడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఆ మహానేతతో 16 ఏళ్ల అనుబంధం కలిగిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై మాట్లాడితే వాటిని వక్రీకరించడం దారుణమన్నారు. చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడించేందుకు ఇదే విజయనగరంలోని బంగ్లాలో అంకురార్పణ చేయడం నిజంకాదా అని ప్రశ్నించారు. కుట్ర రాజకీయాలు టీడీపీ నాయకులకు కొత్త కాదన్నారు. అచ్చెన్నాయుడు టీడీపీపై చేసిన ‘పార్టీ లేదూ, బొక్కా లేదు’ వంటి వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజల మదిలో ఉన్నాయని గుర్తుచేశారు. పార్థసారధి, కన్నా లక్ష్మీనారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వంటి నాయకులు గతంలో చంద్రబాబునాయుడు గురించి చేసిన విమర్శలను ప్రజలు మరచిపోలేదన్నారు. చంద్రబాబుపై వచ్చిన విమర్శలతో పాటు టీడీపీ హయాంలో ప్రభుత్వ వైఫల్యాలపై జిల్లా, నియోకవర్గ స్థాయిల్లో పార్టీ నేతలతో చర్చించి ఫొటో ప్రదర్శన నిర్వహిస్తామన్నారు.
సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణ రాజు, నెక్కల నాయుడుబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇప్పిలి అనంత్, గొర్లె రవికుమార్, వర్రి నరసింహమూర్తి, జిల్లా ఆర్‌టీఐ విభాగ అధ్యక్షుడు అప్పాన సుబ్రహ్మణ్యం, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్, భోగాపురం, గరివిడి మండల పార్టీ అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ, విశ్వేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘు, పార్టీ జిల్లా యాక్టివిటీ కార్యదర్శి పోలీస్ కృష్ణనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టుల పేరిట భూదందాను అడ్డుకుంటాం
భోగాపురం ఎయిర్‌పోర్ట్ పేరుతో పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో భూ స్కాం జరుగుతోందని మజ్జి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల పేరుతో అధికారులు హడావుడి చేయడంతో దానిని ఆసరాగా తీసుకుని కూటమి ప్రజాప్రతినిధులు, దళారులు రైతులను బెదిరించి, ఒత్తిడి తెచ్చి వారి భూములను తక్కువ ధరకే లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తమకు విక్రయించకుంటే ప్రభుత్వమే భూములను స్వాధీనం చేసుకుంటుందంటూ సాగుతున్న ప్రచారంపై కలెక్టర్‌తో పాటు అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు కొత్తగా ఏ ప్రాజెక్టులు మంజూరయ్యాయి.. ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల దగ్గర నుంచి అన్యాయంగా భూములు తీసుకుంటే పోరాటం చేస్తామన్నారు. రైతుల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.
అధికమంది ప్రజలు మావిగన్‌కు మద్దతు
దీనిని పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలి‘ట్రిక్స్’
15 ఏళ్ల కిందట జరిగిన వైఎస్సార్
మృతిపై నీచరాజకీయాలు
సీఎం చంద్రబాబు నీచరాజకీయాలు ప్రజలందరికీ తెలుసు
మాజీ సీఎం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచేందుకు విజయనగరం బంగ్లాలోనే అంకురార్పణ
వైఎస్సార్, జగన్ హయాంలోనే
ఉత్తరాంధ్ర అభివృద్ధి
ఎయిర్‌పోర్టు పేరిట భూ దోపిడీకి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాం
జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు


