అధికారులూ జాగ్రత్త.. ! | - | Sakshi
Sakshi News home page

అధికారులూ జాగ్రత్త.. !

Apr 16 2026 10:42 AM | Updated on Apr 16 2026 10:42 AM

ప్రజాప్రతినిధులను కాదని..

కొత్తవలస: ‘పెద్ద నాయకులు చెప్పారని రూల్‌ఫొజీషన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తే.. సంతకాలు పెట్టింది మీరే,.. భవిష్యత్తులో జరిగే పరిణామాలకు మీరే బాధ్యులవుతారు.. గుర్తించుకోండి... ఈ విషయాలను మీడియా మిత్రుల సమక్షంలో చెప్పకూడదు.. అందుకే వారిని అనుమతించలేదు.. గుర్తుపెట్టుకొని పనిచేయండి.. కాదు, కూడదు అంటే మిమ్మలను రక్షించేవారు ఉండరు.. గుర్తుంచుకోండి’ అంటూ విశాఖపట్నం ఎంపీ ఎం.శ్రీభరత్‌ ఎస్‌.కోట నియోజకవర్గ పరిధిలోని అధికారులకు హుకుం జారీచేశారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. పరోక్షంగా ఎమ్మెల్యే లలితకుమారి హవాకు చెక్‌పెట్టేందుకు, తమ అనుకూలమైన గొంప కృష్ణ వర్గం చెప్పింది వినాలన్న భావనతో అధికారులకు హెచ్చరికలు జారీచేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఉండగానే అధికారులకు రూల్‌ పొజీషన్‌ వివరించడం చర్చకు దారితీసింది. ఎస్‌.కోట నియోజకవర్గంలో ఎంపీ భరత్‌ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. పలు ప్రారంభోత్సవాల అనంతరం కొత్తవలస మండల పరిషత్‌ భవనంలో నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలకు చెందిన మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించలేదు. ప్రభుత్వ పఽథకాలపైన, శాఖల ప్రగతి నివేదికలపై సమీక్షించకుండా... కేవలం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులే చెప్పాలని అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఎమ్మెల్యే ఏవిధంగా ఇబ్బంది పెడుతున్నారన్నది ఆమె సమక్షంలోనే తెలుసుకునేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. నేరుగా ఎమ్మెల్యేను ప్రశ్నించలేక అధికారులతో కట్టడి చేసేందుకు చూస్తున్నారన్న గుసగుసలు వినిపించాయి. ఎమ్మెల్యే చెప్పిన పనులు చేయొద్దని పరోక్షంగా హెచ్చరికలు జారీచేసినట్టు తెలిసింది. ఇది కోళ్ల వర్గంలో కలకలం రేపింది. శ్రీభరత్‌ స్వయంగా సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు తోటల్లుడు కావడం, పార్టీ అధిష్టానం వద్ద పలుకుబడి ఉండడంతో మున్ముందు ఎస్‌.కోటలో స్థానిక ఎమ్మెల్యేను కాదని తను చెప్పిందే జరగాలన్న భావనతో ముందుకు వెళ్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

సమీక్ష సమావేశంలో ఎంపీ పక్కన వేదికపై ఎటువంటి ప్రజాప్రతినిధికాని వారు ఆశీనులు కావడం చర్చకు దారితీసింది. జనసేన పార్టీకి చెందిన ఎస్‌.కోట నియోజకవర్గం ఇన్‌చార్జి ఒబ్బిన సత్యనారాయణ, టీడీపీ నాయకుడు గొరపల్లి రామును డయాస్‌పై కూర్చోబెట్టి అధికారులతో ఎంపీ సమీక్షించడం విమర్శలకు తావిచ్చింది.

అధికారులకు ఎంపీ హెచ్చరిక!

పెద్దలు చెప్పారని సంతకాలు చేస్తే

ఇరుక్కుపోతారు...

మిమ్మలను ఎవరూ కాపాడలేరంటూ వ్యాఖ్యలు

ఎంపీ హెచ్చరికలతో ఉద్యోగుల్లో అలజడి

ఎమ్మెల్యే లలితకుమారి హవాకు

చెక్‌పెట్టేందుకే ఈ హెచ్చరికలంటూ గుసగుసలు

Advertisement
 
Advertisement
Advertisement