విజయనగరం గంటస్తంభం: ఏళ్ల తరబడి భోజన నిర్వాహకులుగా పనిచేస్తున్నాం.. రుచికరమైన వంటలు చేస్తూ విద్యార్థుల కడుపునింపుతున్నాం.. ఉపాధి పొందుతున్నాం.. ఇప్పుడు స్మార్ట్ కిచెన్‌లు అంటూ మా ఉపాధికి గండికొట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు సర్కారు సద్బుద్ధిని ప్రసాదించాలంటూ భోజన కార్మికులు జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాలకు మంగళవారం వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 80 వేలమంది డ్వాక్రా మహిళల ఉపాధికి గండికొట్టొద్దని విన్నవించారు. కనీస వేతనం రూ.10 వేలకు పెంచాలని, ప్రమాద బీమా, గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని, మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.
బిల్లుమడలో బీభత్సం
భామిని: మండలంలోని బిల్లుమడలో ఏనుగుల గుంపు మంగళవారం రెచ్చిపోయి బీభత్సం సృష్టించింది. వివిధ రకాల తోటలపై పడి నాశనం చేసి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. బిల్లుమడకు చెందిన బూస సుగ్రీవులు, కలిశెట్టి రాజు, రాంబాబు రాజు అనే రైతుల తోటలను పీకి తినివేశాయి. చేతి బోర్లు పీకి పైపులను పాడు చేశాయి. అరటి, కొబ్బరి, మామిడి తోటలను ధ్వంసం చేసి తినివేశాయి. దీంతో బాధిత రైతులతో పాటు గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.
ఇసుక తవ్వేస్తే నీరెలా వచ్చేది?
రేగిడి: నాగావళి నదిలో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తున్నారు... లారీలు, ట్రాక్టర్లతో తరలించి సొమ్ముచేసుకుంటున్నారు... రైతుల సాగుభూమలకు నీరందకపోయినా ఫరవాలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. అధికార బలంతో యంత్రాల సాయంతో నదిలో పెద్దపెద్దగోతులు పెడుతున్నారు.. ఇలా అయితే సాగునీరు అందేది ఎలా అంటూ రేగిడి మండలంలోని కందిశ–తునివాడ గ్రామాల రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. రేగిడిబట్టి ఓపెన్‌హెడ్ చానల్‌లో ప్రవహిస్తున్న అరకొర నీటిని చూపిస్తూ అధికార యంత్రాంగం తీరుపై నిరసన తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
అగ్నిప్రమాదాల నివారణపై అప్రమత్తం
పాలకొండ: వేసవిలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ అన్నారు. పాలకొండ అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలన్నారు. ప్రమాద సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని సూచించారు.


