● ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత,
సామిల్లులకు తరలింపు
● పట్టించుకోని అధికారులు
బొబ్బిలిరూరల్: మండలంలో కలప మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇష్టారాజ్యం టేకు, మద్ది లాంటి విలువైన చెట్లను నరికి బహిరంగంగా సామిల్లులకు తరలిస్తున్నారు. బొబ్బిలి మండల పరిధిలో నాలుగు సామిల్లులుండగా కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఉదయం నుంచి అర్ధరాత్రివరకు ట్రాక్టర్లు, లారీలతో కలపను సామిల్లులకు తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన ఫారెస్ట్, రెవెన్యూ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాశిందొరవలస, రామన్నదొరవలస, మోసూరువలస తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లోని టేకుచెట్లను రాత్రిళ్లు నరికి పగటపూట ఎంచక్కా రవాణా చేస్తున్నారు. ఇందులో కొందరు టీడీపీ నాయకులు కలప వ్యాపారంలో ఆరితేరగా అడ్డుకున్న అధికార సిబ్బందికి బొబ్బిలి కోట పేరు చెప్పి తమ పని సులువుగా కానిస్తు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కోటలో మనుషుల మంటూ ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి టేకు చెట్ల అక్రమరవాణా కొనసాగింది. మల్లమ్మపేట గ్రామ శివారు నుంచి ఓ డీపట్టాభూమిలో ఉన్న టేకు చెట్లను నరికి కోమటిపల్లి తరలిస్తున్న ట్రాక్టర్లను కొందరు విలేకరులు ఫొటోలు తీశారు. దీంతో సదరు యజమాని తాను ఓ గ్రామానికి ఉప సర్పంచ్‌నని, అధికార పార్టీకి చెందిన వాడినంటూ హూంకరించాడు. ఎన్నాళ్లుగానో ఈ ప్రాంతంలో కలప వ్యాపారం చేస్తున్నానని,అడ్డు తప్పుకోవాలని ఫొటోలు తీస్తున్న విలేకరులకు బెదిరింపు ధోరణిలో సమాధాన మిచ్చాడు.
అనుమతులు లేకుండానే రవాణా
నిబంధనల ప్రకారం ఎక్కడైనా టేకు,మద్దిలాంటి విలువైన చెట్లను నరికేటప్పుడు అది జిరాయితీ, రెవెన్యూ, డీపట్టాలేదా ఫారెస్టు భూములా అన్నది రెవెన్యూ,ఫారెస్టు శాఖలు నిర్ధారించి నిర్ణయించి అనుమతులు మంజూరు చేస్తాయి.కానీ ఇక్కడ కలప వ్యాపారులు అనుమతులకోసం దరఖాస్తు చేసుకోరు. ఆశాఖల అధికారులు పట్టించుకోరు. అలాంటి ఏ నియమనిబంధనలు ఇక్కడ వర్తించవనేందుకు నిత్యం బొబ్బిలి పట్టణంలోని రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న అక్రమ కలప ట్రాక్టర్లే నిదర్శనం. అలాగే దుగ్గేరు అటవీ ప్రాంతం నుంచి బొబ్బిలి మీదుగా రాజాం ప్రతిరోజూ రాత్రిపూట అక్రమంగా తరలిస్తున్న విలువైన కలపను అడ్డుకునే సాహసం ఆయా శాఖల అధికారులు చేయలేకపోతున్నారు.
కేసులు పెడుతున్నాం
అక్రమంగా తరలుతున్న టేకు కలప ట్రాక్టర్లపై ఫారెస్టు బీట్ ఆఫీసర్‌ను వివరణ కోరగా ఎన్నో మార్లు కేసులు పెడుతున్నామని అయినా వారి ఆగడాలు ఆగడం లేదన్నారు. ఇదే అంశంపై తహసీల్దార్ ఎం శ్రీనును వివరణ కోరగా మల్లమ్మపేటలో టేకు చెట్లు నరికేందుకు ఎవరికి రెవెన్యూ పరంగా అనుమతులు లేవన్నారు. అనుమతుల కోసం దరఖాస్తులు కూడా రాలేదని చెప్పారు.


