విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం వనంగుడిలో పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు నేతేటి ప్రశాంత్ అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అమ్మవారిని అలంకరించారు. మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి బాలాలయంలో కొలువైన అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌లు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు.
తీరప్రాంతంలో మాక్‌డ్రిల్
పూసపాటిరేగ: మండలంలోని తీర ప్రాంత జంక్షన్‌లలో సాగర కవచ్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు మాక్‌డ్రిల్ నిర్వహించారు. కోనాడ జంక్షన్, చింతపల్లి, గోవిందపురం, ముక్కాం, గూడెపువలస జంక్షన్‌లలో ఈ సందర్భంగా పోలీసులు మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తీర ప్రాంతంలో అపరిచిత వ్యక్తుల ఆచూకీ కనిపెట్టడానికి ఈ మాక్‌డ్రిల్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాదరావు, ఎస్‌ఐలు దుర్గాప్రసాద్, సూర్యకుమారి, పాపారావు లతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వేడి తగ్గించిన వర్షం
భామిని: మండలంలో భగభగ మండుతున్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం మధ్యాహ్నం తరువాత వీచిన ఈదురు గాలులు వాతావరణాన్ని మార్చేశాయి. వీచిన గాలుల కు బండ్రసింగి, కడంబసింగి గిరిజన గ్రామా ల మధ్య పెద్ద చెట్టుకొమ్మ విరిగి పడింది. వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అనంతరం కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.ఈ అకాల వర్షానికి మొక్కజొన్న రైతులు నానా అవస్థలు పడ్డారు.
చికిత్స పొందుతూ వ్యక్తి
మృతి
బొండపల్లి: మండలంలోని గరుడుబిల్లి గ్రామంలో గల రైల్వే సిల్పర్ ప్యాక్టరీలో సిల్పర్‌లు లోడ్ చేస్తుండగా లారీ నుంచి జారి పడి గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్సై యు.మహేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరంలోని పూల్‌బాగ్‌కు చెందిన షణ్ముఖరావు కొన్ని రోజుల క్రితం లారీలో సిల్పర్‌లు లోడ్ చేస్తుండగా అదుపు తప్పి పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయన్నారు. దీంతో క్షతగాత్రుడిని విశాఖ పట్నంలోని కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


