సీతానగరం: రైతులు పంట పొలాలకు, నిత్యావసర సరుకుల కొనుగోలుకు మనుషుల రాకపోకలకు మండలంలోని చినభోగిలి రైల్వేగేటు సమీపంలో రహదారి సౌకర్యం కల్పించాలని చినభోగిలి గ్రామస్తులు అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణిని కోరారు. అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి పర్యటనలో భాగంగా మంగళవారం చినబోగిలి రైల్వే పాతగేటు మూసి వేయడంతో రాకపోకలకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో కలిసి గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. చినభోగిలి గ్రామానికి చెందిన భూములు రైల్వే గేటుకు అవతల భాగాన ఉన్నందున సువర్ణముఖి నది సమీపంలో ఉన్న అండర్‌బ్రిడ్జి చుట్టూతిరిగి వెళ్లవలసి వస్తోందని గ్రామస్తులు వాపోయారు. గేటు మూతపడడం వల్ల 1400 ఎకరాల పంట పొలాలకు పనులు సక్రమంగా జరగక, కూలి పనులకు సకాలంలో వెళ్లలేక, నిత్యావసర సరుకుల కొనుగోలుకు, పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ దగ్గర గ్రామస్తులు వాపోయారు. అలాగే కిరాణాషాపులకు కొనుగోలు నిమిత్తం రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో కొనుగోలు దారులులేక ఇబ్బందులు పడుతున్నామని షాపుల యజమానులు ఎంపీకి తెలియజేశారు. తమ సమస్యల పరిష్కారానికి పాత రైల్వే గేటు సమీపంలో చిన్నగేటును ఏర్పాటు చేయాలని కోరారు. ఎంపీ డాక్టర్ తనూజారాణిని కలిసిన వారిలో ఎంపీపీ బలగ రమణమ్మ, జెడ్పీటీసీ ఎం.బాబ్జీ, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బి.శ్రీరాములునాయుడు, మాజీ సర్పంచ్‌లు ఎస్.జగన్నాథం, కె.శ్రీనివాసరావు,గంట రమేష్, మాజీ ఎంపీటీసీలు,చుక్క వెంకటనాయుడు, ఎన్.వెంకయ్య, వి.గుంపస్వామి,చుక్క రాంబాబు,బి అప్పారావు, గణేష్ ఉన్నారు.
అరకు ఎంపీకి వినతి


