రక్తం సరఫరాలో నిర్లక్ష్యం..! | - | Sakshi
Sakshi News home page

రక్తం సరఫరాలో నిర్లక్ష్యం..!

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

విజయనగరం ఫోర్ట్‌:

క్తం సరఫరాలో ప్రైవేటు బ్లడ్‌ బ్యాంక్‌లు నిబంధనలు పాటించడం లేదు. సేకరించిన రక్తంలో ప్రభుత్వ రక్తనిధి కేంద్రానికి ఇవ్వాల్సిన రక్తం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. నిబంధన ప్రకారం ప్రతి ప్రైవేటు బ్లడ్‌బ్యాంక్‌ తాము సేకరించిన దాంట్లో 30 శాతం రక్తం ప్రభుత్వ రక్తనిధి కేంద్రానికి ఇవ్వాలి. కొన్ని బ్లడ్‌ బ్యాంక్‌లు అసలు ఇవ్వడం లేదని సమాచారం. జిల్లాలో మొత్తం 9 బ్లడ్‌ బ్యాంక్‌లు ఉన్నాయి. వీటిలో ఒకటి సర్వజన ఆస్పత్రిలోని ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంక్‌ కాగా, జీఎంఆర్‌వీ, మిమ్స్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఎన్‌వీఎన్‌, న్యూలైఫ్‌, విజయ, రోగరీ పవిత్రదేవి, బొబ్బిలి బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తం అవసరమైన రోగులకు ఉచితంగా రక్తాన్ని అందిస్తారు. ప్రైవేటు బ్లడ్‌ బ్యాంక్‌లో అయితే టెస్టింగ్‌ చార్జీల నిమిత్తం రూ.1000 నుంచి రూ.1200 వరకు తీసుకుంటారు.

2025–26లో 25,040 యూనిట్లు సేకరణ

జిల్లాలో ఉన్న బ్లడ్‌బ్యాంక్‌ల నిర్వాహకులు 2025–26లో 25,040 యూనిట్ల రక్తం సేకరించారు. స్వచ్ఛంద రక్తదానం ద్వారా 18,783 యూనిట్లు, జిల్లాలో నిర్వహించిన 204 రక్తదాన శిబిరాల్లో 6,257 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 30 శాతం లెక్కన 6 వేల యూనిట్లను ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంక్‌కు రక్తం అందజేయాలి. అయితే, కొన్ని బ్లడ్‌ బ్యాంక్‌లు 30 శాతం రక్తం ఇవ్వలేదని ఆస్పత్రివర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల పేద రోగులకు ఉచితంగా రక్తం సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నాయి. నిబంధనలు పాటించాలని కోరుతున్నాయి.

ప్రభుత్వ రక్తనిధికి ఇవ్వని ప్రైవేటు

బ్లడ్‌ బ్యాంక్‌లు

30 శాతం రక్తం సరఫరాలో కోత

జిల్లాలో 9 బ్లడ్‌ బ్యాంక్‌లు

2025–26లో బ్లడ్‌ బ్యాంక్‌లు

సేకరించిన రక్తం: 25,040 యూనిట్స్‌

స్వచ్ఛంద రక్తదానం ద్వారా 18,783 యూనిట్ల సేకరణ

నిర్వహించిన రక్తదాన శిబిరాలు: 204

నిబంధనలు పాటించకపోతే చర్యలు

ప్రైవేటు బ్లడ్‌ బ్యాంక్‌లు సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ రక్తనిధి కేంద్రానికి ఇవ్వాలి. ఏ బ్లడ్‌ బ్యాంక్‌ అయినా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ కె.రాణి,

జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement