● విధులు బహిష్కరించిన న్యాయవాదులు
విజయనగరం లీగల్: అన్నమయ్య జిల్లాలో సీనియర్ న్యాయవాది పూజారి ఎల్లయ్యను హత్యచేయడంపై విజయనగరం న్యాయవాదులు సోమవారం తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ సందర్బంగా న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు నళితం రమేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం అమలులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఈ చట్టం ప్రతిపాదనదశలోనే ఉండిపోయిందన్నారు. సవరణల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయ డం తగదన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చొరవతీసుకొని తక్షణమే రక్షణ చట్టం అమలులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసన కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు గడి మురళీకృష్ణ, పి.బ్రహ్మాజీ, పి.వరలక్ష్మి, గీతా ప్రవీణ్, జేవీఎస్‌ఎన్ మూర్తి, రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక బస్సులు
● ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు వెల్లడి
పూసపాటిరేగ: ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు నేరుగా చేరుకునేందుకు ప్రత్యేక బస్సులు నడపాలని విమానయాన సంస్థ నుంచి ప్రతిపాదనలు అందాయని ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు సోమవారం తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఎయిర్‌పోర్టుకు విశాఖపట్టణం నుంచి 20 ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, రాజాం, పార్వతీపురం, పలాస తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడిపేందుకు ఆలోచనలు చేస్తున్నామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రజారవాణా విషయమై ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు సైతం సమీక్షా సమావేశాలు నిర్వహించారన్నారు.
ఖైదీలపట్ల వివక్ష చట్టరీత్యా నేరం
● సబ్‌జైలును తనిఖీ చేసిన న్యాయసేవా సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్
బొబ్బిలి: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ స్థానిక సబ్ జైలును సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తోటి ఖైదీల పట్ల వివక్ష చూపడం చట్టరీత్యా నేరమన్నారు. లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను సందర్శించి అక్కడి విధులను పరిశీలించారు. అక్కడున్న ఖైదీలను, వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలపై ఆరా తీశారు. నేరప్రవృత్తిని వీడాలని హితవు పలికారు. వారికి ప్రభుత్వ పరంగా అందజేసే ఉచిత న్యాయసేవలను వివరించారు. వంట సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు.


