● జేసీ సేతుమాధవన్
విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించే అధికారులకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్జీల పరిష్కారానికి తొలి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు. ప్రీ ఆడిట్, ఆడిట్ ప్రక్రియల్లో అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని, మండల ప్రత్యేక అధికారులు మండల స్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలను తనిఖీ చేసి సిబ్బంది హాజరు, పనితీరును పరిశీలించాలని ఆదేశించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, రీ వెరిఫికేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రెవెన్యూ శాఖకు సంబంధించిన మ్యుటేషన్లు, సబ్ డివిజన్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


