● జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి
పార్వతీపురం రూరల్: గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన.. విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జేసీ సి. యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ గిరిమిత్ర హాల్‌లో 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాస్పెక్టివ్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై గిరిజన సంఘాల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతే అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం, రక్షిత మంచినీటి సరఫరా, విద్యుదీకరణ, అంగన్‌వాడీ భవన నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతిగృహాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, గిరిజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


