ఆడుతూ పతకాలు పట్టేద్దాం.. | - | Sakshi
Sakshi News home page

ఆడుతూ పతకాలు పట్టేద్దాం..

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు

ఎంపికలు

ఉత్తర్వులు జారీ చేసిన శాప్‌

అర్హతలివే..

● దరఖాస్తు చేసుకునేందుకు 15 నుంచి 19 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు మాత్రమే అర్హులు.

● క్రీడాకారులు 01–01–2008 నుంచి 01–01–2011 మధ్య జన్మించిన వారై ఉండాలి.

● జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, చదువుతున్న పాఠశాల/కళాశాల నుంచి సర్టిఫికెట్‌, క్రీడా ప్రతిభా సర్టిఫికెట్‌ (రాష్ట్ర/జాతీయ స్థాయి ఉంటే), మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, పది పాస్‌ పోర్టు సైజు పొటోలు తీసుకెళ్లాలి.

● ఎంపికల సమయంలో క్రీడా దుస్తులు, కిట్‌ తప్పనిసరి.

● ఎంపికై న వారికి శాప్‌ క్రీడా అకాడమీలలో వసతి, భోజనం, శిక్షణ సౌకర్యాలు అందించనున్నారు.

● అర్హత గల క్రీడాకారులు స్పోర్ట్స్‌ ఏపీ.జీఓవీ.ఇన్‌ వైబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

విజయనగరం: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో క్రీడా అకాడమీల పునఃప్రారంభానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా తిరుపతి, విశాఖపట్నం, కాకినాడలలో స్పోర్ట్స్‌ అకాడమీలు తిరిగి ప్రారంభించనుంది. 2026 – 27 సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 26 నుంచి మే 6 వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలను చేపట్టనుంది. మూడు అకాడమీలలో మొత్తం 12 క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అథ్లెటిక్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, సైక్లింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, ఖోఖో, జూడో, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, రైఫిల్‌ షూటింగ్‌, లాన్‌ టెన్నిస్‌ విభాగాల్లో ఎంపికై న బాల,బాలికలకు శిక్షణ అందనుంది.

ఆరు విభాగాల్లో..

తిరుపతి క్రీడా అకాడమీలో అత్యధికంగా ఆరు విభాగాల్లో (జూడో, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రైఫిల్‌ షూటింగ్‌, లాన్‌ టెన్నిస్‌) రెసిడెన్షియల్‌ కోచింగ్‌ బాలురు, బాలికలకు వేర్వేరుగా ఇవ్వనున్నారు. జూడో, బ్యాడ్మింటన్‌, రైఫిల్‌ షూటింగ్‌, లాన్‌ టెన్నిస్‌లో ఒక్కో విభాగం నుంచి పది మంది బాలురు, పది మంది బాలికలను తీసుకోనున్నారు. బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఒక్కో విభాగం నుంచి 15 మంది బాలురకు శిక్షణ అందించనున్నారు.

మూడు క్రీడాంశాల్లో..

విశాఖపట్నంలోని స్పోర్ట్స్‌ అకాడమీలో మూడు క్రీడాంశాల్లో (అథ్లెటిక్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ , సైక్లింగ్‌) బాలురుకు రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో క్రీడ నుంచి 15 మంది బాలురును ఎంపిక చేయనున్నారు. మే 4న అథ్లెటిక్స్‌, మే 5న సైకింగ్‌, మే 6న వాటర్‌ స్పోర్ట్స్‌ విభాగాలకు సంబంధించి విశాఖపట్నం కొమ్మాదిలో ఎంపికలు చేపట్టనున్నారు.

బాలికలకు మాత్రమే..

కాకినాడలోని క్రీడా అకాడమీలో బాలికలకు మాత్రమే నాలుగు క్రీడాంశాల్లో (వెయిట్‌లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, ఖోఖో) రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 29న వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌లో, 30న హాకీ, ఖోఖో విభాగాల్లో బాలికలకు కాకినాడ డీఎస్‌ఏలో ఎంపికలు చేపట్టనున్నారు.

మంచి అవకాశం..

క్రీడల్లో రాణించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఈ ఏడాది నుంచి మూడు జిల్లాల్లోని అకాడమీల్లో శిక్షణ ఇచ్చేందుకు శాప్‌ నిర్ణయించింది. ప్రవేశాలకు సంబంధించి ఎంపికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

– ఎస్‌.వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి, విజయనగరం.

Advertisement
 
Advertisement
Advertisement