అంగన్‌వాడీ కార్యకర్త పనితీరుపై విచారణ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కార్యకర్త పనితీరుపై విచారణ

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

విజయగరం ఫోర్ట్‌: పట్టణంలోని ధర్మపురి సెంటర్‌ – 2 కార్యకర్త సీహెచ్‌ రమాదేవి పనితీరుపై ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ తెంటు త్రినాథ సోమవారం విచారణ చేపట్టారు. కేంద్రానికి వచ్చే పిల్లలు, గర్భిణులు, బాలింతలను దుర్భాషలాడుతూ, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందనే ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు సూపర్‌వైజర్‌ లబ్ధిదారులు, ఆయాను విచారించి, వివరాలు తెలుసుకున్నారు. నివేదికను సీడీపీఓకు అందజేస్తామని సూపర్‌వైజర్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

విద్యార్థినికి గాయాలు

బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట జాతీయ రహదారి 26పై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థినికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామానికి చెందిన సీహెచ్‌ పద్మ బోడసింగిపేటలోని సాయిసిద్ధార్థ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. మధ్యాహ్నం కళాశాల ముగిసిన తర్వాత గజపతినగరం వైపు నడుచుకుంటూ వస్తుండగా.. గజపతినగరం వైపు నుంచి విజయనగరం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు మైనర్లు విద్యార్థినిని ఢీ కొట్టారు. దీంతో పద్మకు గాయాలు కావడంతో సహచర విద్యార్థినులు, స్థానికులు ఆమెను గజపతినగరంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తుమ్మికాపల్లిలో అగ్ని ప్రమాదం

మామిడి, టేకు తోటలు దగ్ధం

గజపతినగరం రూరల్‌: మండలంలోని తుమ్మికాపల్లిలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన ఎస్‌.శంకర్‌, ఎస్‌.పైడితల్లి, ఎస్‌. నారాయణప్ప, కె .తాతి నాయుడు, కె.నారాయణలకు చెందిన సుమారు పదెకరాల మామిడి,టేకు తోటలు కాలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తి కాల్చిన సిగరెట్టు/బీడీ పడేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసున్తన్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు.

ముద్దాయికి రెండేళ్ల జైలుశిక్ష

డెంకాడ: పోలీసుల విధులకు ఆటంకం కల్పించడంతో పాటు వారిపై దాడి చేశారన్న అభియోగాలపై మండలంలోని గుణుపూరుపేట గ్రామానికి చెందిన పి. నారాయణరావు అనే వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమాన విధిస్తూ విజయనగరం మహిళా కోర్టు న్యాయమూర్తి ఎన్‌.పద్మావతి సోమవారం తీర్పు చెప్పినట్లు ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2024 మార్చి 5న సతీష్‌, శంకర్‌ అనే కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో భాగంగా పెద తాడివాడ పంచాయతీ పరిధి ఏఎస్‌ఆర్‌ నగర్‌ వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా.. నిందితుడు నారాయణరావు కానిస్టేబుల్‌ సతీష్‌ను మోటార్‌ సైకిల్‌తో ఢీ కొట్టి వెళ్లిపోయాడు. దీంతో సతీష్‌ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాలు విన్న తర్వాత ముద్దాయి జైలు శిక్ష, జరిమాన విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

విజయనగరం క్రైమ్‌: జిల్లా కేంద్రంలోని గాయత్రీనగర్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు లెంక అప్పలనాయుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. రూరల్‌ ఎస్సై అశోక్‌ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల పదో తేదీన ఇంటిలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోవడంతో అప్పలనాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement