● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్
విజయనగరం అర్బన్: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్–2026) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీతో నిర్వహించిన సమావేశంలో పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25న నిర్వహించనున్న పాలిసెట్–2026 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 8,053 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. వీరి కోసం విజయనగరంలో 8, నెల్లిమర్లలో ఒకటి, గజపతినగరంలో 6, చీపురుపల్లిలో 5, బొబ్బిలిలో 4 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను సూచించారు. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల రవాణాకు పోలీస్ బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖకు.. కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యశాఖకు.. తాగునీటి సదుపాయం కల్పించాలని మున్సిపాల్ శాఖకు సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, పాలిసెట్ జిల్లా కన్వీనర్ జి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


