సమస్యలకు చట్టబద్ధమైన పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సమస్యలకు చట్టబద్ధమైన పరిష్కారం

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

ఎస్పీ మాధవ్‌రెడ్డి

పార్వతీపురం రూరల్‌: ప్రజలు తెలియజేసిన సమస్యలకు చట్టబద్ధమైన పరిష్కారం చూపించి, వారికి భరోసా ఇవ్వాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పోలీస్‌ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. కుటుంబ కలహాలు, సైబర్‌ మోసాలు, ఆస్తి వివాదాలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. బాధితులు తెలియజేసిన సమస్యలను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే చేపట్టిన చర్యలపై సమగ్ర నివేదికను జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు.

ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మాధవ్‌రెడ్డి కోరారు. అర్జీదారులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం, ఎస్సై అశోక్‌ చక్రవర్తి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు 50 ఫిర్యాదులు..

విజయనగరం క్రైమ్‌: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 50 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలకు సంబంధించినవి 10, కుటుంబ కలహాలకు సంబంధించినవి 4, చీటింగ్‌ కేసులు 6, నగదు వ్యవహారాలకు సంబంధించినవి 5, ఇతర అంశాలకు చెందినవి 25 అర్జీలున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ..సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్‌బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఎస్సైలు రాజేష్‌, ప్రభావతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement