● గిట్టుబాటు ధర లేని చింతపండు
● జీసీసీ కేజీ ధర రూ.46
● కొనుగోలులో జీసీసీ కంటే వ్యాపారులే నయమంటున్న గిరిజనులు
● కేజీ చింతపండును రూ.75 నుంచి 80 వరకు కొనుగోలు
కురుపాం: చింతకు గిట్టుబాటు ధర అంతేనా...? ఇలా ఐతే జీసీసీ బలోపేతమెలా..? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది చింతపండు దిగుబడి తక్కువగా ఉండటంతో స్థానిక మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతుంది. కేజీ చింతపండు రూ. 75 నుంచి 80 వరకు స్థానిక వ్యాపారులు నేరుగా గిరి శిఖరాలకు వెళ్లి గిరిజనుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత బట్టి రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. అయితే గిరిజన సహాకార సంస్థ (జీసీసీ) మాత్రం వ్యాపారుల కంటే తక్కువకే గిట్టుబాటు ధర ఇస్తుండటంతో మరో దారి లేని గిరిజన రైతులు నేరుగా వ్యాపారులకే తాము సేకరించిన చింతపండును విక్రయిస్తున్నారు.
● జీసీసీ విఫలం
ఈ ఏడాది ఏజెన్సీలో చింతపండు దిగుబడి చాలా తక్కువగా ఉండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతుంది. ఇటువంటి సమయంలో జీసీసీ గిట్టుబాటు ధర కల్పించటంలో విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతీ ఏడాది ఇదే తంతు జరుగుతుందని ఇలా ఐతే జీసీసీ బలోపేతమయ్యేది ఎప్పుడని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక మార్కెట్లో వ్యాపారులు కేజీ చింతపండును రూ.75 వరకు కొనుగోలు చేస్తుంటే జీసీసీ మాత్రం కేజీ చింతపండుకు రూ.46 గిట్టుబాటు ధర ఇస్తున్నట్లు ప్రకటించటం ఏమిటని గిరిజన రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తూకంలో తేడా...
కొంత మంది వ్యాపారులు తమ ఎలక్ట్రానిక్ కాటాలలో చేతి వాటం కారణంగా గిరిజనులు విక్రయిస్తున్న చింతపండుకు 25 కేజీల చింతపండు 22 కేజీలు ఉన్నట్లు చూపటం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ కాటాలపై అంత పరిజ్ఞానం లేని గిరిజనులు మోసపోతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంత తంతు జరుగుతున్నా సంబంధిత తూనికలు, కొలతల అధికారులు మాత్రం జాడ కానరావడం లేదు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.


