టెన్త్‌ మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయుల నిరసన | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయుల నిరసన

Apr 10 2026 9:33 AM | Updated on Apr 10 2026 9:33 AM

టెన్త్‌ మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయుల నిరసన

విజయనగరం అర్బన్‌: ఫ్యాప్టో పిలుపు మేరకు దశల వారీ పోరాటంలో భాగంగా విజయనగరం పట్టణంలోని పీఎస్‌ఆర్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి స్పాట్‌ మూల్యాంకన కేంద్రంలో గురువారం ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఫ్యాప్టో చైర్మన్‌ పాల్తేరు శ్రీనివాస్‌, సెక్రటరీ జనరల్‌ సిహెచ్‌.భాస్కరరావు, ఆర్థిక కార్యదర్శి డి.శ్యామ్‌ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు 12వ పీఆర్‌సీ కమిషన్‌ను తక్షణమే నియమించాలని, ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. 12వ పీఆర్‌సీ మూడు సంవత్సరాలుగా ఆలస్యమైందని, కనీసం కమిషన్‌ను కూడా నియమించకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. దీని వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని, వెంటనే 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని కోరారు. సుమారు రూ.30 వేల కోట్ల బకాయిల చెల్లింపులకు స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ ప్రకటించి విడతల వారీగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉంచడం అన్యాయమని, వెంటనే వాటిని విడుదల చేయాలని కోరారు. సీపీఎస్‌, జీపీఎస్‌ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, మెమో 57 అమలు చేసి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులను పాత పెన్షన్‌ కిందికి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి సర్వీసుల సమస్యలను పరిష్కరించడంతో పాటు కారుణ్య నియామకాలను ఆలస్యం చేయకుండా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల పీఎఫ్‌ సమస్యను పరిష్కరించడంతో పాటు అర్బన్‌ ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని, పాఠశాలల్లో బోధనేతర పనులను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు కె.విజయ్‌గౌరి, డి.ఈశ్వరరావు, జోగినాయుడు, ఎల్‌.శివప్రసాద్‌, జి.సూర్యనారాయణ, ఎమ్‌.బలరామునాయుడు, ఎన్‌.వెంకట్‌నాయుడు, వై.అప్పారావు, కె.శ్రీనివాసరావు, ఎన్‌.వి.పైడిరాజు, వి.రమణ, టి.సన్యాసిరాజు, యం.మదన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement