తారాపురంలో పొలంలో నూర్పిడికి సిద్ధంగా ఉన్న మొక్కజొన్న కండెలు
(ఇన్‌సెట్లో) రామభద్రపురం మండలం కొట్టక్కిలో వీధిలో ఆరబెట్టిన మొక్కజొన్న గింజలు
రామభద్రపురం:
ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసిన రైతన్నకు మేలుచేయడంలో చంద్రబాబు సర్కారు కినుక వహిస్తోంది. పంట చేతికొచ్చేవేళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకుండా ఆవేదనకు గురిచేస్తోంది. మొన్న అపరాలు, నేడు మొక్కజొన్న పంట సాగుచేసిన రైతులను నిలువునా ముంచేస్తోంది. పంటను పొలంలో ఉంచుకోలేక, అమ్ముకునేదారిలేక మొక్కజొన్న గింజలను క్వింటా రూ. 1600– 1700 మధ్యన వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వాస్తవంగా క్వింటాకు రూ.2400 మద్దతు ధర అందాల్సి ఉంది. క్వింటా వద్ద రూ.700 నుంచి రూ.800 వరకు రైతులు నష్టపోతున్నారు.
● ఆది నుంచీ అంతే...
చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా కష్టాలు తప్పవన్నది రైతులమాట. ఎన్నికల సమయంలో ఊరించడం, తర్వాత నట్టేట ముంచడం చంద్రబాబుకు అలవాటే అని విమర్శిస్తున్నారు. మొక్కజొన్న పంట నూర్పిళ్లు ముమ్మరంగా జరుగుతున్నా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడంలో ప్రభుత్వ జాప్యంపై మండిపడుతున్నా రు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని, లేదంటే మార్క్‌ఫెడ్‌తో మద్దతు ధరకు మొక్క జొన్న గింజలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు సంక్షేమాన్ని విస్మరించిన ఏ ప్రభుత్వానికి మనుగడ ఉండదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించుకోవాలంటున్నారు.
విజయనగరం జిల్లాలో గతేడాది 17,691 హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగుచేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో అఽధిక వర్షాలు కురవడంతో పత్తిని సాగుచేసిన రైతులు దెబ్బతిన్నారు. ప్రత్యామ్నాయంగా 45,591 హెక్టార్లలో మొక్కజొన్న పంటను సాగుచేశారు. పంట ఆశాజనకంగా ఉండడం, ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుండడంతో సంతోషపడ్డారు. అయితే, పంట చేతికొచ్చేవేళ కురుస్తున్న అకాల వర్షాలు, మరోవైపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుచేయడంలో చంద్రబాబు సర్కారు జాప్యం రైతులకు శాపంగా మారింది. పొలంలో పంటను ఉంచుకోలేక... అమ్ముకునే దారిలేక రైతు కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. వర్షం కురిసేవేళ మొక్కజొన్న పొత్తులు, గింజలను రక్షించుకునేందుకు ఇంటిల్లిపాదీ పొలానికి పరుగుతీస్తున్నారు. కొన్నిచోట్ల కళ్లముందే తడిసిపోతున్న పంటను చూసి కన్నీరుపెడుతున్నారు.
ఇదీ
పరిస్థితి..
పంట చేతికొచ్చినా జాడలేని మొక్కజొన్న కోనుగోలు కేంద్రాలు
క్వింటాకు రూ.1700లకు మించి
కొనుగోలు చేయని వ్యాపారులు
రైతులకు దక్కని రూ.2,400 ప్రభుత్వ మద్దతు ధర
పెట్టుబడి ఖర్చులు రావట్లేదని రైతుల
ఆందోళన
మార్క్‌ఫెడ్‌తో కొనుగోలు చేయించాలని రైతుల డిమాండ్


