● టీడీపీ నేత నిర్వాకం
● సామాజిక తనిఖీలో బట్టబయలు
● రికవరీకి ఆదేశం
గుర్ల: అధికార బలంతో ఓ టీడీపీ నేత రోడ్డు వేయకుండానే బిల్లులు కాజేశాడు. తిరిగి రోడ్డు వేసేశానంటూ అధికారులను బుకాయించాడు. తీరా సామాజిక తనిఖీల్లో నేత నిర్వాకం బయటపడింది. ఇన్నాళ్లూ పెద్దమనిషిగా చలామణి అయిన పచ్చనేత ప్రజాధనం స్వాహా తీరును చూసి గ్రామస్తులు ఛీకొట్టేపరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... గుర్ల మండలం గొలగాం పంచాయతీ పరిధిలో 2024–2025 ఆర్థిక సంవత్సరంలో పల్లె పండగలో భాగంగా రూ.3.50 లక్షల వ్యయంతో కొత్తపేట రామారావు ఇంటి నుంచి గ్రామంలోని బీటీరోడ్డు వరకు సీసీ కాలువ, సీసీ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కాంట్రాక్టర్‌గా మారి పనులను పూర్తిచేశాడు. రూ.1.63 లక్షల విలువ గల సీసీ కాలువను నిర్మించి, రోడ్డు కూడా నిర్మించినట్టు మొత్తం రూ.3.50 లక్షలు బిల్లులు చేసుకున్నాడు. దీనివెనుక కొందరు ఉద్యోగుల హస్తం ఉన్నట్టు సమాచారం. అయితే, చేయని పనులకు బిల్లులు చెల్లించినట్టు ఉపాధిహామీ ఉన్నతాధికారుల సామాజిక తనిఖీలో గుర్తించారు. పనుల్లో లోపాలను బహిర్గతం చేశారు. దీంతో పనులు చేసిన వెండర్, టీడీపీ నాయకుడు ఈ విషయాన్ని బయటపెట్టవద్దంటూ అధికారులను ప్రాథేయపడినట్టు సమాచారం. పనులు చేయకుండా కాజేసిన రూ.1.87లక్షలను తిరిగి చెల్లిస్తానని చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయంపై ఉపాధి హమీ ఏపీఓ రత్నమాల మాట్లాడుతూ మండల ఇంజినీరింగ్ అధికారులు ఇచ్చిన కొలతలు, ఎంబుక్ ఆధారంగా బిల్లులు చెల్లించామని చెప్పారు.


