● మూతదిశగా నారాయణ
జూనియర్ కాలేజీ
● ఉన్నఫలంగా విద్యార్థులకు టీసీలు
● ఆవేదనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
బొబ్బిలి: స్థానిక నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థుల భవితవ్వం ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ సుమారు 40 మంది విద్యార్థులు ఫస్టియర్ నుంచి సెకెండియర్‌కు వెళ్తున్నారు. మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యేందుకు విద్యార్థులెవరూ ముందుకు రావడం లేదు. దీంతో భవనం అద్దె, కరెంట్ బిల్లులు, వేతనాల నిర్వహణ భారమైందని, వెంటనే మీ అబ్బాయిని తీసుకుని వస్తే టీసీ ఇచ్చేస్తామని తల్లిదండ్రులకు ఫోన్లుచేసి ఒక్కో ప్రాంతానికి చెందిన వారిని ఒక్కోరోజు పిలుస్తూ టీసీ లిచ్చేస్తున్నారు. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సాలూరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు శశాంక్, దిలీప్ కుమార్‌ల తల్లిదండ్రులు తమనాన శ్రీనివాసరావు, బండి లక్ష్మణరావు కళాశాల సిబ్బందిని బుధవారం నిలదీశారు. ఇప్పటికిప్పుడు టీసీలు ఇచ్చేస్తే ఎక్కడ చేర్చాలంటూ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఉన్నఫలంగా బోర్డు తిప్పేస్తే మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని మండిపడ్డారు. న్యాయం చేయాలని కోరారు. ప్రిన్సిపాల్‌కు ఫోన్‌చేస్తే రండి అని పిలిచి కాలేజ్ లాస్‌లో ఉందని, అందుకే యాజమాన్యం ఆదేశాలతో తాము నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫస్టియర్ ఓ చోట, సెకెండియర్ మరోచోట చదివితే వారి భవిష్యత్తు ఏమవుతుందన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నడిపే కళాశాలను లాభాలు రావడంలేని మూసేయడం దారుణమని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఏజీఎం శ్రీనివాసరావును సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన ఫోన్ పనిచేయడం లేదు.


