ఫీజు చెల్లించలేదని ఎండలో నిలబెట్టారు..? | - | Sakshi
Sakshi News home page

ఫీజు చెల్లించలేదని ఎండలో నిలబెట్టారు..?

Apr 5 2026 9:24 AM | Updated on Apr 5 2026 9:24 AM

తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణకు ఆదేశించిన డీఈఓ

బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామ రెవెన్యూ పరిధిలో గల సురేష్‌ స్కూల్‌ యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు ఫీజు చెల్లించలేదని కొంతమంది విద్యార్థులను మూడు రోజులుగా ఎండలో నిలబెట్టారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను ప్రశ్నించారు. అన్ని ఫీజులు చెల్లించామని.. బస్సు ఫీజు కొంత బకాయి ఉంటే విద్యార్థులను ఎండలో ఎలా నిలబెడతారని ప్రశ్నించారు. విద్యార్థులు వడదెబ్బకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. అయితే యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తల్లిదండ్రులు డీఈఓ యు. మాణిక్యంనాయుడుకు ఫిర్యాదు చేయగా.. ఆయన సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఎంఈఓ – 2 అల్లు వెంకటరమణను ఆదేశించారు.

ఎడ్ల బండిని ఢీ కొట్టిన లారీ

ఎద్దు మృతి

ఒకరికి గాయాలు

సీతానగరం: మండలంలోని జాతీయ రహదారిపై కాశీపేట – చినబోగిలి గ్రామాల మధ్య పెట్రోల్‌బంక్‌ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎద్దు మృతి చెందగా.. రైతుకు గాయాలయ్యాయి. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని ఆర్‌ వెంకంపేట గ్రామానికి చెందిన రైతులు సువర్ణముఖీనది నుంచి ఇసుక తరలించడానికి ఆరు నాటుబళ్లతో సీతానగరం వస్తున్నారు. సరిగ్గా పెట్రోల్‌ బంక్‌ సమీపానికి వచ్చే సమయానికి బొబ్బిలి వైపు నుంచి వస్తున్న లారీ ఓ నాటుబండిని ఢీ కొట్టడంతో సంఘటనా స్థలంలోనే ఎద్దు మృతి చెందగా.. బండి యజమాని కర్రి రాముకు గాయాలయ్యాయి. వెంటనే సహచరులు స్పందించి క్షతగాత్రుడ్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలానికి స్థానిక పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.

కుక్కల దాడిలో లేగదూడ మృతి

రాజాం సిటీ: పట్టణ పరిధి బుచ్చెంపేట గ్రామంలో శుక్రవారం రాత్రి వీధి కుక్కలు దాడిలో ముద్దాడ అప్పన్నకు చెందిన లేగ దూడ మృతి చెందింది. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువుగా ఉందని, గతంలో కూడా పశువులు మృత్యువాతపడ్డాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను వీధుల్లోకి తీసుకురావాలంటేనే భయపడుతున్నామని వాపోయారు. కుక్కల బారి నుంచి పశువులు, మనుషులను రక్షించాలని అధికారులను కోరారు.

ఉపాధిహామీలో అవకతవకలు

రూ. 6.08 లక్షల రికవరీకి ఆదేశం

వంగర: మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో జరిగిన ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు బయటపడ్డాయి. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో 2024–25లో చేసిన పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 30 పంచాయతీల్లో 1031 పనులకు గాను ఉపాధి వేతనదారుల ద్వారా రూ. 8 కోట్ల 88 లక్షల 39 వేల 282 రూపాయలు ఖర్చుచేయగా, మెటీరియల్‌ రూపంలో రెండు కోట్ల 59 లక్షల 40 వేల 690 రూపాయలతో కలిపి మొత్తం 11 కోట్ల 49 లక్షల 79 వేల 972 రూపాయలు ఖర్చుచేశారు. ఎస్‌ఆర్‌పీ కె.చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో ఐదు సామాజిక తనిఖీ బృందాలు సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. కొన్ని పంచాయతీల్లో చూపుతున్న పనులకు, చేసిన ఖర్చుకు తేడా ఉండడంతో రికవరీలకు ఆదేశించినట్లు ఏపీడీ రమామణి తెలిపారు. మొత్తం 29 పంచాయతీల్లో రూ. 24 లక్షల అవకతవకలను తనిఖీ బృందాలు గుర్తించగా 6,08,701 రూపాయల రికవరీకి అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, మండల ప్రత్యేకాధికారి చంద్రకుమారి, ఎంపీడీఓ తులా రాజారావు, డీఆర్‌డీఏ సిబ్బంది, ఏపీఓ ఎస్‌.హరినాథ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement