ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ సోమవారం వివిధ వర్గాల ప్రజల ధర్నాలతో దద్దరిల్లింది. భవన నిర్మాణ కార్మికులు, పట్టణ కాలనీల నివాసితులు, రైతులు, మహిళలు, ప్రజా సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం నినదించారు. ప్రభుత్వ తీరుపై నిరసన గళం వినిపించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

కార్మిక సంక్షేమం ఏది ‘బాబూ’

కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌ వెంటనే చెల్లించాలని, ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని, అంగవైకల్య పరిహారం, స్కాలర్‌షిప్స్‌, వివాహ, ప్రసూతిసహాయం వంటి అన్ని పథ కాలు అమలుచేయాలని భవననిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) డిమాండ్‌ చేసింది. కార్యక్రమంలో జిల్లా కార్యదర్మి బి.రమణ, రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.అసరప్పడు, జిల్లా కోశాధికారి ఎ.జగన్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

––––––––––––––––––––––– –––––

మౌలిక సదుపాయాలు కల్పించండి

విజయనగరం సమీపంలోని గుంకలాం జగనన్న కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కాలనీవాసులు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు. తాగునీరు, రోడ్లు, వీధిదీపాలు, ఆస్పత్రి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు రెడ్డి శంకరరావు పాల్గొన్నారు.

––––––––––––––––––––––– –––––

ధరల కట్టడి ఎప్పుడు?

గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు సరుకులు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ధరల నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

సమస్యలతో ‘తల్లి’డిల్లుతూ...

చిత్రంలోని మహిళ పేరు పోలిపల్లి జగదీశ్వరి. జామి మండలంలోని భీమసింగి గ్రామం. భర్త మరణించాడు. కూలిపనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఆమెకు తెలుపురేషన్‌కార్డు ఉన్నా ఇన్‌కంట్యాక్స్‌ పేయర్‌గా నమోదుకావడంతో పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, తల్లికి వందనం వంటి పథకాలు అందడం లేదని, సమస్యను పరిష్కరించాలంటూ కలెక్టర్‌కు వేడుకుంది.

––––––––––––––––––––––– –––––

రీసర్వే లోపాలపై రైతుల ఆందోళన

రీసర్వేలో జరిగిన తప్పిదాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ రాకోడు గ్రామ రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రైతుల సమక్షంలో రీ సర్వే నిర్వహించి భూ రికార్డులు సరిచేయాలని డిమాండ్‌ చేశారు.

––––––––––––––––––––––– –––––

డంపింగ్‌ యార్డు తొలగించాలి

కొత్తవలస మండలం రాజన్న కాలనీ సమీపంలోని డంపింగ్‌ యార్డు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వాయు కాలుష్యంతో వ్యాధుల బారిన పడుతున్నామని, తక్షణమే డంపింగ్‌యార్డును తొలగించాలని కోరుతూ కాలనీ వాసులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేశారు. కార్యక్రమంలో వబ్బిన సన్యాసినాయుడు, మొగ్గ ప్రశాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement