తెర్లాం మండలం పెదపాలవలసలో ఈదురు గాలులకు నేలరాలిన మామిడి కాయలు
తెర్లాం/మెరకముడిదాం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. గాలి దాటికి విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. హోర్డింగ్‌లు, రేకులు ఎగిరిపడ్డాయి. మామిడి, మొక్కజొన్న పంటలకు అపారనష్టం వాటిల్లింది. రబీలో సాగుచేసిన వరి పంట కొన్నిచోట్ల నేలవాలగా, మరికొన్నిచోట్ల కోసిన చేను తడిసిముద్దయింది.
● తెర్లాం మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన కాబోతుల రాము అనే రైతు ఎద్దు పిడుగుపాటుకు గురై మృతి చెందింది. తెర్లాం ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ దాటిన తరువాత, డి.గదబవలస–పణుకువలస రోడ్డు మధ్యలో చెట్లు నేలకూలాయి. ఆమిటి గ్రామంలో పశువుల శాలలు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.
● మెరకముడిదాం మండలం సోమలింగాపురం గ్రామ కూడలిలోని ఓ హోటల్ పైకప్పు, పలు షాపులకు చెందిన పైకప్పు రేకులు చెల్లాచెదురయ్యాయి. విద్యుత్‌తీగలు తెగిపడ్డాయి. సోమలింగాపురం, మెరకముడిదాం, బుధరాయవలస, గర్భాం, చినబంటుపల్లి తదితర గ్రామాల్లో కోసిన వరిచేను తడిసిపోవడంతో రైతులు గగ్గోలుపెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
మామిడి,
మొక్కజొన్న
రైతులకు
అపార నష్టం
తడిసిన
రబీ వరి


